దైవానికి ఇష్టము
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #DaivanikiIshtamu, #దైవానికిఇష్టము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 114
Daivaniki Ishtamu - Somanna Gari Kavithalu Part 114 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 03/09/2025
దైవానికి ఇష్టము - సోమన్న గారి కవితలు పార్ట్ 114 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
దైవానికి ఇష్టము
--------------------------------------------------
సత్యమైన మాటలు
శ్రేష్టమైన తలపులు
దైవానికి ఇష్టము
శుద్ధమైన మనసులు
సాయపడే చేతులు
కష్టపడే వ్యక్తులు
దైవానికి ఇష్టము
ఉంటేనే గుణములు
స్వచ్ఛమైన ప్రేమలు
నిస్వార్థ సేవలు
దైవానికి ఇష్టము
మల్లెలాంటి పిల్లలు
సహకరించు దాతలు
నడిపించే నేతలు
దైవానికి ఇష్టము
స్ఫూర్తినిచ్చు మనుషులు

ఆశ-ఆశయం
---------------------------------------
నీతిగా బ్రతుకుతాం
జ్యోతిలా వెలుగుతాం
జాతి మేలు కోరుతాం
ఖ్యాతిని నిలబెడుతాం
యేరులా సాగుతాం
పైరులా పెరుగుతాం
అందరికి సాయపడే
నీరులా మారుతాం
వానలా కురుస్తాం
తేనెధార అవుతాం
వీనులవిందు చేస్తూ
వీణలా మ్రోగుతాం
మొక్కలా ఎదుగుతాం
పక్కిలా ఎగురుతాం
మంచి పనులే చేసి
చుక్కలా వెలుగుతాం

శ్రేష్టమైన స్నేహము
--------------------------------------
విలువైనది స్నేహము
చేయరాదు ద్రోహము
వీలైతే గనుక
చేయాలోయ్! త్యాగము
నిలుచునోయ్! అండగా
ఉండునోయ్! గుండెగా
సృష్టిలోనే శ్రేష్టము
అదే ఆణిముత్యము
కాంతులీను దీపము
ప్రేమకు ప్రతిరూపము
వదంతులు నమ్మొద్దు
నిప్పు రాజేయవద్దు
స్నేహానికి ప్రాణము
ఉన్నదోయి నేస్తము!
మరువకు ఈ సత్యము
స్మరించుకో సతతము

చూడంగా అందమే!
--------------------------------------
మల్లెపూలు విరిసినా
మంచు తెరలు వీడినా
చూడంగా అందమే!
మంచితనం చాటినా
వెన్నెలమ్మ కురిసినా
ఫైరగాలి వీచినా
చూడంగా అందమే!
చిన్నారులు నవ్వినా
సెలయేరులు పారినా
మల్లెతీగ ప్రాకినా
చూడంగా అందమే!
మయూరమే ఆడినా
కోడిపుంజు కూసినా
హంసమ్మ నడిచినా
చూడంగా అందమే!
పావురాయి ఎగిరినా

అమ్మ అక్షర ప్రబోధం
--------------------------------------
వీడరాదు ధర్మము
చెదరరాదు ధ్యేయము
సునామీలు వచ్చినా
తలక్రిందులు చేసినా
తప్పరాదు న్యాయము
పనికిరాదు స్వార్ధము
దైనందిన జీవితాన
కల్గియుండు శాంతము
వ్యర్థమైన వాదము
తెచ్చిపెట్టు నష్టము
ఆదిలోన వదిలితే
ఎంతైనా లాభము
పెట్టరాదు కష్టము
కన్నవారి మహిలో
తేవాలోయ్! మోదము
గుప్పెడంత మదిలో
-గద్వాల సోమన్న

Comments