top of page

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3

Updated: Sep 20, 2025

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory


Dayyam@thommido Mailu - Part 3 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 15/09/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

భార్యను చెన్నై లో హాస్పిటల్ లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం. దారిలో తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు టాక్సీ ఆపుతాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పమని కొడుకు గోపినాథ్ ను పంపుతాడు స్వామినాథం. తొమ్మిదో మైలు దగ్గరకు స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. అక్కడ పొలం దగ్గర షెడ్ లో ఉన్న రంగయ్యను కలుస్తాడు. 

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 3 చదవండి. 


రంగయ్య ట్రంక్ పెట్టెలో డాక్టర్లు వేసుకొనే పొడవాటి తెల్లటి గౌన్ ఉంది. 


నిర్ఘాంతపోయారు అందరూ. 


అంటే ఈ గౌన్ వేసుకొని రంగయ్య రోడ్ లో కూర్చుని ఉన్నాడన్న మాట. 


అది చూసి మోహన్ కు చాలా కోపం వచ్చింది. కానిస్టేబుల్స్ అయితే రంగయ్యను కొట్టడానికి లాఠీని ఎత్తారు. వాళ్ళను వారించాడు మోహన్. 


రంగయ్య వంక చూస్తూ "చెప్పు రంగయ్యా! దయ్యంలా ఎందుకు భయపెట్టాలనుకున్నావు" కోపంగా అడిగాడు. 


అర్థం కానట్లు చూశాడు రంగయ్య. 


"నాటకాలు వద్దు. ఈ గౌనుతో జనాలను భయపెట్టాలని చూశావు. మేము ఇక్కడికి రావడంతో దొరికిపోయావు" అన్నాడు ఒక కానిస్టేబుల్. 


అతన్ని వారించాడు స్వామినాథం. 


"తొందర పడకండి. రంగయ్య అలాంటివాడు కాదు. అతన్ని చెప్పనివ్వండి" అన్నాడు స్వామినాథం. 


రంగయ్య జవాబు చెప్పడానికి సంకోచిస్తున్నాడు. 


"రంగయ్యా! జవాబు చెప్పు. లేకుంటే నిన్ను అనుమానిస్తారు" అన్నాడు స్వామినాథం. 


"అది.. మా అబ్బాయి డాక్టర్ గా ఉన్నాడు కదా! ఒకసారి నన్ను చూడ్డానికి ఇంటి దగ్గరకు వచ్చాడు. నేను పొలంలో ఉన్నానని చెప్పడంతో ఇక్కడికి వచ్చాడు. నాకోసం తెచ్చిన తినుబండారాలు, మందులు ఇచ్చాడు. అప్పుడు అతని బాగ్ లో ఈ గౌను చూసాను. " చెప్పడం ఆపి అందరివంకా చూశాడు రంగయ్య. తరువాత కొద్దిగా సిగ్గు పడుతూ "నాకు చిన్నప్పటి నుండి డాక్టర్ డ్రెస్సు వేసుకోవాలని ఆశ. నేను ఆశగా చూడ్డం గమనించిన మా అబ్బాయి ఆ గౌన్ నాకు తొడిగాడు. సెల్ ఫోన్లో నా ఫోటో తీసాడు. ఈసారి వచ్చినప్పుడు డాక్టర్లు మెడలో వేసుకుంటారు కదా.. దాన్ని కూడా తెచ్చి ఇస్తానన్నాడు" చెప్పాడు రంగయ్య. 


"మరి దాన్ని ఇంట్లో ఉంచుకోవాలి కదా" అడిగాడు మోహన్. 


"అక్కడ ఎవరన్నా చూస్తే నవ్వుకుంటారని ఇక్కడే ఉంచాను. ఇక్కడ అప్పుడప్పుడు వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటాను. " బిడియంగా చెప్పాడు రంగయ్య. 


పెద్దగా నవ్వేశాడు మోహన్. 


"ఎవరో ఏదో అనుకుంటారని సంకోచం వద్దు. ఈ గౌన్ ఇంటికి తీసుకెళ్లి, తొడుక్కొని అందరికీ చూపించు. ఇక్కడ ఉంచుకొని అనవసరంగా మాకు లేనిపోని అనుమానాలు పుట్టించావు" అన్నాడు మోహన్. 


ఆ గౌన్ ను ట్రంక్ పెట్టెలో పెట్టి, ఆ పెట్టెను బీరువా పైన పెట్టేసాడు రంగయ్య. 


"ఒకసారి ఊర్లోకి వెళదాం రంగయ్యా! అక్కడ ఎవరినైనా దయ్యం గురించి అడుగుదాము. నేను ఈ దయ్యాలను నమ్మను. కాబట్టి డ్రైవర్ రాజు ఎందుకలా చెప్పాడో తేల్చేయాలి. " అన్నాడు మోహన్. 


"ఊర్లో వాళ్ళు దయ్యాన్ని చూసింది ఎప్పుడో పదేళ్ల కిందట. ఇప్పుడు దయ్యాన్ని చూశానని చెప్పింది ఆ డ్రైవర్ ఒక్కడే. అయినా ఊర్లోకి వెళదాం. కానీ.. " సందేహించాడు రంగయ్య. 


"చెప్పు రంగయ్యా" అన్నాడు మోహన్. 


"ఇంకోరోజు కాస్త ముందుగానే వస్తే బాగుంటుంది. ఇప్పడు మీరు తిరిగి వెళ్లేసరికి చీకటి పడుతుందేమో.. పైగా గాలి.. వర్షం.. " అన్నాడు రంగయ్య. 


"ఇలాంటి వాటికి భయపడితే మేము ఈ పోలీసు ఉద్యోగం చేయలేము. పైగా మా సీనియర్ స్వామినాథం గారు తోడుగా ఉన్నారు" అన్నాడు మోహన్. 


"అవును రంగయ్యా. నేనుండగా మోహన్ కు ఏ ఆపదా రానివ్వను. అవసరమైతే నా ప్రాణం అడ్డు వేస్తాను" అన్నాడు స్వామినాథం. 


"అంత దూరం వద్దులే. ఇంకా మొదలే కదా. అపుడే ఏమీ జరగదులే. పదండి. ఊర్లోకి వెళదాము" అన్నాడు రంగయ్య. 


 అందరూ ఆ షెడ్ నుండి బయటకు వచ్చారు. పొలం గట్ల వెంట జాగ్రత్తగా నడుచుకుంటూ రోడ్డు దగ్గరికి వచ్చారు. అందరూ జీప్ లో కూర్చున్నారు. జీప్ వేటపాలెం రోడ్డులో వెళ్తోంది. 


“సరిగ్గా అర్ధ కిలోమీటర్ మాత్రమే జీప్ లో వెళ్లగలం. తరువాత వాగు ఒకటి వస్తుంది. అందులో జీప్ వెళ్ళదు. వాగులో నీళ్లు లేనప్పుడైతే కనీసం బైక్ లు తోసుకుంటూ వెళ్లి, వాగు దాటాక డ్రైవ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఇప్పుడు నీళ్ళల్లో దిగి నడవడమొకటే దారి. ఇంకొకసారి ఆలోచించుకోండి" అన్నాడు స్వామినాథం. 


"వాగుదాకా వెళ్లి పరిస్థితి చూద్దాం. నేను, మా కానిస్టేబుల్స్ కూడా మారుమూల పల్లెలనుంచి వచ్చిన వాళ్ళం. " అన్నాడు మోహన్. 


కాసేపట్లోనే జీపు వాగును చేరుకుంది. వాగులో నీళ్లు మోకాలు లోతు ప్రవహిస్తున్నాయి. 


స్వామినాథం వాగు వంక పరిశీలనగా చూసి "ఇప్పుడైతే వాగును దాటగలం. సరిగ్గా పది నిముషాలు పడుతుంది. ఈలోగా పెద్ద వాన మొదలైతే మాత్రం రిస్క్" అన్నాడు. 


రంగయ్య మాట్లాడుతూ "మాకైతే ఈ వాగు దాటడం అలవాటే. రెండు రోజుల్నుంచి వాగు దాటే మా పొలాల దగ్గరికి వస్తున్నాను" అన్నాడు. 


అందరూ మాట్లాడుకుని, జీప్ ని అక్కడే వదిలి వాగును దాటారు. అంతవరకూ కనికరించిన వాన ఒక్కసారిగా భారీగా కురవడం ప్రారంభించింది. ఒక వంద మీటర్ల దూరంలోనే ఒక పాడుబడ్డ గుడిలాంటిది కనిపించింది. 


"కాస్సేపు ఆ గుడిలో తలదాచుకుందాం" అన్నాడు మోహన్. 

 

"అక్కడా.. " సంకోచించాడు రంగయ్య. 


"ఏం? గుడేగా.. దయ్యం అక్కడికి రాలేదు" అన్నాడు మోహన్. 


ఏదో చెప్పబోతున్న రంగయ్యను వారించాడు స్వామినాథం. "ఇప్పుడేదో చెప్పి భయపెట్టకు. వాన నుండి తప్పించుకోవడానికి అదొక్కటే దిక్కు" అంటూ అటువైపు నడిచాడు. 

 

అందరూ అతన్ని అనుసరించారు. 


అదొక చిన్న గుడి. గుడి బయట రేకులతో చిన్న షెడ్ వేసి ఉన్నారు. 


వీళ్ళు వెళ్లేసరికి అక్కడ తెల్లటి గడ్డంతో ఒక ముసలి వ్యక్తి గుడిలోనుండి బయటకు వస్తున్నాడు. 


రంగయ్యను చూసి అతను "ఈ వానలో ఎందుకు వస్తున్నావు రంగయ్యా! పైగా పోలీసులను వెంటబెట్టుకుని వస్తున్నావు.. " ఆశ్చర్యంగా అడిగాడు. 


ఏమి చెప్పాలో అని మోహన్ వంక చూసాడు రంగయ్య. 


"ఈయనెవరో?" అడిగాడు మోహన్. 


"ఈయనొక సాధువు. చాలా ఏళ్ళనుండి ఇక్కడే ఉంటున్నాడు. దారిన వెళ్లే వాళ్ళు ఏదైనా పెడితే తింటాడు. లేకుంటే పస్తు ఉంటాడు. ఎవ్వరినీ యాచించడు" చెప్పాడు రంగయ్య. 


"నమస్కారం సాధువు గారూ" అన్నాడు మోహన్. 


ఆ సాధువు మోహన్ వంక చూసి, "విజయం సాధిస్తావు బాబూ" అన్నాడు, చేతిని పైకెత్తి దీవిస్తూ. 


"మీరెవరో తెలీదు. కానీ మీ దీవెన నాకు కొండంత ధైర్యాన్నిస్తోంది" అన్నాడు మోహన్. 


షెడ్ లో కొన్ని సిమెంట్ బెంచీలు వేసి ఉన్నాయి. శిధిలావస్థలో ఉన్న ఆ బెంచీల పైనే అందరినీ కూర్చోమన్నాడు సాధువు. తాను కూడా మోహన్ పక్కన కూర్చున్నాడు. 


'ఇది ఏ గుడి?" అడిగాడు మోహన్. 


"నిజానికి ఇక్కడ కాలభైరవ విగ్రహం ఉండేది. పూజలు కూడా జరుగుతుండేవి. పదేళ్లకు ముందు ఈ ఊర్లో దయ్యం తిరుగులాడింది. జనాలు భయంతో భూములు అమ్ముకుని వెళ్లిపోవాలని చూసారు. కానీ కొనేవాళ్ళు లేరు. 


దాంతో ఒక నాయకుడు చెన్నై నుండి బ్రోకర్లను పిలిపించాడు. చెన్నైలో అక్రమంగా డబ్బులు సంపాదించిన కొందరు బినామీ పేర్లతో ఆంధ్రాలో భూములు కొనేవారు. దాంతో చాలామంది భూములు అతని ద్వారా అమ్ముకుని వేరే ఊళ్లకు వెళ్లిపోయారు. అప్పట్లో ఊరు సగం ఖాళీ అయింది. 


వాళ్ళు కొన్న భూములకు మధ్యలో ఈ గుడి ఉంది. దీన్ని కూడా కలుపుకోవాలని చూసారు. కానీ ఊర్లో మిగిలి ఉన్న జనాలు ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తరువాత గుడిలో విగ్రహం మాయమయింది. గుర్తు తెలియని విగ్రహాల దొంగలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు. 


విగ్రహం లేక పోవడంతో ఈ స్థలం వేరేవాళ్లు కబ్జా చేస్తారని, నేను ఇక్కడ కొన్ని దేవుళ్ళ పటాలను ఉంచాను. ఇప్పుడిప్పుడే దారమ్మట వెళ్లే వాళ్ళు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు' చెప్పాడు సాధువు. 


"ఐతే అప్పట్లో దయ్యం ప్రభావం చాలానే ఉందన్నమాట. స్వామినాథం గారూ! మీరు ఈ ఊరి వారే కదా. మీరు ఏమనుకుంటున్నారు ఈ దయ్యం గురించి?" అడిగాడు మోహన్. 


"నేను దయ్యాన్ని స్వయంగా చూడ్డం వల్లనే కదా ఈ వూరు వదిలి పెట్టింది. కాబట్టి దయ్యం అబద్ధం కాదు" అన్నాడు స్వామినాథం. 

అంతలో ఒక నల్లటి కుక్క ఎక్కడినుంచి వచ్చిందో కానీ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గర్భగుడిలోకి దూరింది. దాన్ని తరమడానికి సాధువు ఒక కర్ర తీసుకొని గుడిలోకి వెళ్లాడు. 


హఠాత్తుగా అయన కేక బిగ్గరగా వినిపించింది. మోహన్ వెంటనే గుడి లోపలికి వెళ్లాడు. 


అక్కడ ఆ సాధువు నేలపైన పడి ఉన్నాడు. అతని తలనుండి రక్తం కారుతోంది. 


ఆ కుక్క కోసం వెతికాడు మోహన్. ఎక్కడా కనపడలేదు. సాధువును పైకి లేపి బయటకు తీసుకుని వచ్చి షెడ్ లో ఒక బెంచీమీద పడుకోబెట్టాడు. కింద పడ్డం వల్ల తలకు చిన్న గాయం అయింది. పెద్ద దెబ్బేమీ కాదు. 


రంగయ్య తన భుజం పైనున్న టవల్ ను మోహన్ కు అందించాడు. నెత్తురు రాకుండా సాధువు తలపై ఆ టవల్ ను అదిమి ఉంచాడు మోహన్. 

***

బాల్కనీలో నుంచుని రోడ్ వంక చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఒక యువకుడు. 


ఇంతలో ఒక పాతికేళ్ల అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. 

"మొదటి అడుగు సరిగ్గా పడింది" అతని భుజంపై చెయ్యి వేసి చెప్పింది. 


"గుడ్. ఒక్క అడుగు కూడా పొరపాటు పడకూడదు. ఎవరి పాత్రలు వాళ్ళు సరిగ్గా పోషించాలి" చెప్పాడతను. 


ఆ యువతి వెళ్ళాక హాల్ లోకి వచ్చి టేబుల్ పైనున్న ఫైల్ వంక చూసాడు. 


దానిపైన ‘దయ్యం@తొమ్మిదోమైలు’ అని ఉంది. 

=========================================================

ఇంకా ఉంది

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments


bottom of page