top of page

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4

Updated: Sep 25, 2025

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory


Dayyam@thommido Mailu - Part 4 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 20/09/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

భార్యను చెన్నై లో హాస్పిటల్ లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం. దారిలో తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు టాక్సీ ఆపుతాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పమని కొడుకు గోపీనాథ్ ను పంపుతాడు స్వామినాథం. తొమ్మిదో మైలు దగ్గరకు స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. 


అక్కడ పొలం దగ్గర షెడ్ లో ఉన్న రంగయ్యను మొదట అనుమానిస్తాడు. తరువాత అందరూ వేటపాలెం బయలుదేరుతారు. పాడుబడ్డ గుడి దగ్గర గాయపడ్డ సాధువుకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు ఎస్సై మోహన్. 

అదే సమయంలో మరొక చోట ఒక అజ్ఞాత వ్యక్తి 'దయ్యం@తొమ్మిదోమైలు' అనే ఫైల్ లో జరగబోయే భాగం చూస్తూ ఉంటాడు. 

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 4 చదవండి. 


సాధువు తల నుండి రక్తం కారడం ఆగింది. అతని ముఖం పైన నీళ్లు చిలకరించాడు మోహన్. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సాధువు. 


"ఆ కుక్క ఎక్కడ?" స్పృహలోకి రాగానే సాధువు అడిగిన మొదటి మాట అది. 


"ఆ కుక్క బయటికి రాలేదు" అని సమాధానం ఇచ్చి మిగిలిన వారి వంక చూసి "మీరేమైనా ఆ కుక్క బయటకు రావడం గమనించారా?" అని అడిగాడు మోహన్. 


"మేము అటువైపు చూస్తూనే ఉన్నాము. ఆ కుక్క బయటకు రాలేదు. ఒకవేళ బయటకు వెళ్ళడానికి మరేదైనా దారి ఉందేమో.." అన్నాడు స్వామినాథం. 


"అది కుక్క కాదు. సాక్షాత్తు కాల భైరవుడే. నేను లోపలికి వెళ్లేసరికి మునుపు అక్కడ ఉన్న విగ్రహంలాగా కనిపించాడు. ఆ భయంతో స్పృహ తప్పింది" అన్నాడు సాధువు. 


“ఆ కుక్క అక్కడే ఒక మూల ఉండి ఉంటుంది. నేను వెళ్లి చూసి వస్తాను" అంటూ మోహన్ గర్భ గుడి వైపు వెళ్ళాడు. 


"మోహన్! ఒక్కడివే వెళ్లొద్దు. నేను కూడా వస్తున్నా" అంటూ అతని వెనకే నడిచాడు స్వామినాథం. 


మిగతా వాళ్ళు కూడా కాస్త వెనకగా వీళ్ళతో వచ్చారు. 


గర్భగుడిలోకి ప్రవేశించిన మోహన్ అక్కడ వెలుగుతున్న చిన్నపాటి దీపపు వెల్తురులో చుట్టూ పరిశీలనగా చూశాడు.


అక్కడ విగ్రహం లేదు కానీ విగ్రహం కోసం కట్టిన దిమ్మె ఉంది. దానిపైన కొన్ని పటాలు నిలబెట్టబడి ఉన్నాయి. దిమ్మ వెనుక భాగంలో ఆ కుక్క ఉండవచ్చని అనుమానించాడు మోహన్. 


"వెనక్కి వెళ్లి చూద్దాం పదండి" అన్నాడు తన కానిస్టేబుల్స్ తో. 


వాళ్లు భయంగా చూడడం గమనించిన స్వామినాథం "నేను వస్తాను పదండి” అన్నాడు. 


ఇద్దరూ ఆ దిమ్మ వెనకవైపుకు వెళ్లి చూసి వచ్చారు. ఆ కుక్క అక్కడ లేదు. 


"అది నల్ల కుక్క కదా! ఎటో వెళ్లిపోయి ఉంటుంది. ఇక్కడ అంతగా వెలుతురు లేదు కదా.. చీకటిలో మనం గమనించి ఉండము" అన్నాడు మోహన్. 


ఇంతలో ఆ దిమ్మ మీద ఉన్న పటాల వంక చూసిన సాధువు "కాలభైరవా" అంటూ పెద్దగా కేక వేశాడు. అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు. 


ఆ సాధువు వణుకుతున్న కంఠంతో "గుడిలో విగ్రహం మాయం కావడంతో నేను మా ఇంటి నుండి కొన్ని దేవుళ్ళ పటాలు తెచ్చి ఇక్కడ ఉంచాను. అందులో ఈ కాలభైరవుడి పటం లేదు. మరి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. సాక్షాత్తు ఆ కాల భైరవుడే కుక్క రూపంలో వచ్చాడు" అన్నాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటూ, అక్కడ ఉన్న ఒక పటాన్ని చూపిస్తూ. 


మోహన్ ఆ పటాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూశాడు. అక్కడ మిగిలి ఉన్న పటాలన్నిటికీ కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. కానీ ఈ పటానికి ఏ విధమైన బొట్టు లేదు. పైగా వానకు తడిసినట్లుగా పటమంతా తడి తడిగా ఉంది. 


అది గమనించిన స్వామినాథం "సాధువు చెప్పింది నిజమే కావచ్చు. ఇది కాలభైరవుడి ఆలయం కదా! ఒకవేళ కాలభైరవుడే శునక రూపంలో వచ్చి ఇక్కడ పటంగా మారిపోయాడేమో" అన్నాడు. 


మిగిలిన వారంతా ఆ పటానికి నమస్కరిస్తూ 'జై కాలభైరవ' అన్నారు. 


"ఇలాంటి వాటిని నేను అస్సలు నమ్మను. సాధువు లాగే మరెవరైనా తమ ఇంట్లో వాడకంలో లేని కాలభైరవుడి పటం ఇక్కడ తెచ్చి పెట్టి ఉండవచ్చు" అన్నాడు మోహన్. 


"అలా ఎవరైనా చేయాలనుకున్నా గర్భగుడికి బయటే ఉంచుతారు. లోపలికి వచ్చి పటాన్ని ఉంచేంత ధైర్యం గ్రామస్థులు ఎవరూ చేయరు" అన్నాడు సాధువు. 


"ఇక్కడ ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహం లేదు కదా. కాబట్టి ఇది ఒక మందిరం లాంటిది మాత్రమే. ఎవరైనా లోపలికి రావచ్చు" అన్నాడు మోహన్. 


"అది నిజమే కానీ మా పల్లెటూరి జనాలకు అంత ఆలోచన ఉండదు కదా. ధైర్యంగా లోపలికి వెళ్లరు" అన్నాడు రంగయ్య. 


"ప్రజల్లో ఉండే మూఢ నమ్మకాలే దయ్యాలు కనిపించడానికి ప్రధాన కారణం" అన్నాడు మోహన్. 


ఇంతలో ఒక కుక్క పెద్దగా అరుస్తున్న శబ్దం వినపడింది. మోహన్ ఏదో అనే లోపల ఒక్కసారిగా 100 కుక్కలు బిగ్గరగా అరుస్తున్న శబ్దం వినపడింది. కాలభైరవుడి పటం తీవ్రంగా కంపించ సాగింది. 


సాధువు, మోహన్ చేయి పట్టుకొని “ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు" అంటూ అతన్ని బయటకు నడిపించాడు. 


మిగిలిన వారు కూడా బయటకు వచ్చేశారు. అందరూ బయట షెడ్ లో ఉన్న బల్లల మీద కూర్చున్నారు. కుక్క అరుపుల శబ్దం ఆగింది కానీ బయట వాన ఉధృతి పెరిగింది. మబ్బులు బలంగా కమ్మేయడంతో అది సాయంత్రం సమయం అయినా రాత్రి లాగా అనిపించ సాగింది. ఇంతలో ఆ గుడికి బయట తెల్లటి దుస్తుల్లో ఒక ఆకారం కనిపించింది. 


"అదిగో దయ్యం" అని కేక పెట్టాడు ఒక కానిస్టేబుల్. 

 

"వాన పెద్దదవుతోంది. లోపలికి రండి" ఆ ఆకారం వైపు చూస్తూ కేక వేశాడు మోహన్. 


ఆ ఆకారం కదలకుండా అతన్ని బయటకు రమ్మన్నట్లు సైగ చేసింది. కదలబోతున్న మోహన్ ను ఆపాడు రంగయ్య. 


"గుడిలోకి రావడానికి భయపడిందంటే అది ఖచ్చితంగా దయ్యమే అయి ఉంటుంది. మీరు వెళ్ళవద్దు" అన్నాడు. 


కానీ మోహన్ వినిపించుకోకుండా గుడి నుండి బయటకు వెళ్ళాడు. అక్కడ తెల్ల చీర కట్టుకొని ఉన్న ఒక 50 ఏళ్ల స్త్రీ, చెంగును తల నిండుగా కప్పుకుని ఉంది. 


మోహన్, ఆమె వారిస్తున్నా వినకుండా ఆమె చేయి పట్టుకుని షెడ్లోకి తీసుకొని వచ్చాడు. రంగయ్య ఆమె వంక చూసి "చామంతమ్మా, నువ్వా.. ఈ టైంలో ఎక్కడినుంచి వస్తున్నావ్" అని అడిగాడు. 


"కండ్రిగలో మా అన్న చనిపోయినాడు కదా.. నా కొడుకుని తొడుక్కుని పోయి, చూసి వస్తా ఉన్నాము.. చీకటి పడకుండానే ఇంటికి చేరుకోవచ్చని అనుకున్నాము. తొమ్మిదో మైలు దగ్గర బస్సు దిగేటప్పటికి పెద్ద వాన పట్టుకుంది. అక్కడ, మూసి ఉన్న చెంగయ్య టీ కొట్టు కాడ కాసేపు ఇద్దరం ఉన్నాము.. కాస్త తగ్గగానే బయలుదేరి వాగు కాడికి వచ్చినాము. అక్కడ.. అక్కడ.. " చెబుతూ ఉండగానే ఆమె గొంతు వణక సాగింది.. 

తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఆమెకు అందించాడు మోహన్. 

రెండు గుక్కలు తాగి, తిరిగి చెప్పడం ప్రారంభించింది ఆమె. 

“వాగు దగ్గర ఒక పోలీస్ జీప్ ఆగి వుంది. అందులో తెల్లగా దయ్యం మాదిరి ఏదో కూర్చొని ఉంది. ఆ దయ్యం అటుపక్కకు తిరిగి ఉంది. 


నా కొడుకు నన్ను మాట్లాడొద్దని సైగ చేసిండు. సెల్లులో ఫోటో తీసినాడు. వాగులో నీళ్లు బాగా పారతా ఉండాయి. కానీ దయ్యం భయానికి వాగు దాటేసినాము. వాగు దాటినాక నా కొడుకు సెల్ ఫోన్లో ఆ ఫోటో చూపించాడు. 


"అమ్మా! జీపులో దయ్యాన్ని ఫోటో తీసినాను కదా. చూడు" అన్నాడు. 


అది జీపులో అటేపు తిరిగి కూర్చుని ఉన్న దయ్యం ఫోటో. 


'అమ్మా! అది నిజంగా దయ్యమయితే ఫోటోలోకి రాదు. ఆడు ఖచ్చితంగా మనిషే. పదేళ్ల ముందు నాయన చనిపోయింది ఈ మాదిరి దయ్యం వల్లనే. నేను అటేపు వెళ్లి ఆ దయ్యం సంగతి తేలుస్తాను. నువ్వు కొంచెంసేపు ఆ గుడికాడ ఉండు. ఊర్లో ఉన్న నా దోస్తులకు ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చి నిన్ను తొడుక్కొని పోతారు' అన్నాడు. 


'నువ్వొక్కడివే పోవద్దురా. వాళ్ళు వచ్చినాక పోదువులే' అన్నాను. 


'లేదమ్మా. ఆ దయ్యం తప్పించుకుంటుంది. కండ్రిగ నుంచి మనోళ్ళని బైకుల్లో వాగు కాడికి రమ్మన్నాను. భయం లేదులే' అంటూ నామాట ఇనకుండా వాగులోకి దిగినాడు" 


చెప్పడం ముగించింది చామంతమ్మ. 


ఇంతలో నాలుగైదు బైకులు ఆ గుడి ముందు ఆగాయి. 

కొంతమంది యువకులు గుడిలోకి వచ్చారు. 


శేఖర్ అనే యువకుడు చామంతమ్మ వద్దకు వచ్చి, "పెద్దమ్మా! ఇంటికాడ వదులుతా పద. తిరిగి వచ్చి వాగు దాటాల. ఈ రోజు ఆ దయ్యం సంగతి తేల్చేయాల" అన్నాడు. 


"సేకరా! మీ అన్న మురళి ఒక్కడే ఆ దయ్యం కాడికి పోయినాడు. ఏమౌతాదో ఏమో.. నేను కూడా వాగు దాటతా. " అంది. 


మోహన్ కల్పించుకుని, "వద్దు చామంతమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. మేమంతా వాగు దాటి జీపు దగ్గరకు వెళ్తున్నాము. అది దయ్యమైనా మనిషైనా అంతు చూసేదాకా వదలము" అన్నాడు. 


తరువాత స్వామినాథం వైపు తిరిగి, ఇక వేటపాలెం వెళ్లే పని లేదు. నేరుగా దయ్యం దగ్గరికి వెళదాం" అన్నాడు. 

అందరూ వాగు దగ్గరికి చేరారు. వాగు ఉద్ధృతి ఏమీ పెరగలేదు. 

ఆశ్చర్యంగా చూస్తున్న మోహన్ తో "ఎగువన పడే వర్షాల వల్ల నీళ్లు ఎక్కువవుతాయి. ఇక్కడ పడే వానలకు పెద్ద మార్పేమీ ఉండదు" అన్నాడు స్వామినాథం. 


ఇంతలో ఒక యువకుడికి చామంతమ్మ కొడుకు మురళి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. 


"వాగు దాటాను. ఆ దయ్యం జీపు స్టార్ట్ చెయ్యాలని చూస్తోంది. అది ఖచ్చితంగా మనిషే. కండ్రిగ నుండి మన వాళ్ళెవ్వరూ ఇంకా రాలేదు. నేను వెళ్లి జీపును ఆపుతాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. 


"ఊరివాళ్ళు వాగు దాటడానికి పోలీసులకు సహాయం చెయ్యండి. రంగయ్యా. నువ్వు ఊర్లోకి వెళ్ళు. మాతో వద్దులే.. పెద్దవాడివి కదా" అన్నాడు స్వామినాథం. 


"లేదులే. నాకు కూడా దయ్యాన్ని చూడాలని ఉంది" అన్నాడు రంగయ్య. 


అందరూ వాగు దాటడం ప్రారంభించారు. 


దూరంగా మసక వెలుతురులో జీప్ హెడ్ లైట్లు వెలగడం గమనించారు. ఆ జీప్ వేగంగా వాగులోకి, వీళ్ల వైపు దూసుకొని వస్తోంది. 

=========================================================

ఇంకా ఉంది

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments


bottom of page