top of page

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5

Updated: Sep 30, 2025

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory


Dayyam@thommido Mailu - Part 5 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 25/09/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

భార్యను చెన్నై లో హాస్పిటల్ లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం. దారిలో తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు టాక్సీ ఆపుతాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పమని కొడుకు గోపీనాథ్ ను పంపుతాడు స్వామినాథం. తొమ్మిదో మైలు దగ్గరకు స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. పాడుబడ్డ గుడి దగ్గర గాయపడ్డ సాధువుకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. 


అదే సమయంలో మరొక చోట ఒక అజ్ఞాత వ్యక్తి 'దయ్య@తొమ్మిదోమైలు' అనే ఫైల్ లో జరగబోయే భాగం చూస్తూ ఉంటాడు. వాగు దగ్గర ఆపిన జీపులో దయ్యం ఉందని, దాన్ని పట్టుకుంటానని మురళి అనే యువకుడు వెళ్తాడు. 


ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 5 చదవండి. 


జీప్ వేగంగా వాగులో నీళ్ల వైపు వస్తోంది. డ్రైవింగ్ సీట్ లో ఎవరు లేరు. పక్కన మురళి అనే యువకుడు అక్కడ అదృశ్యంగా ఉన్న వ్యక్తితో పెనుగులాడుతున్నాడు. 


"మురళీ! అక్కడెవరూ లేరు. అది నీ భ్రమ. డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బ్రేక్ వెయ్యి" గట్టిగా అరిచాడు మోహన్. 


ఎవరినో నెట్టేసినట్లుగా మురళి డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి, బ్రేక్ వేసి, జీప్ ను ఆపాడు. 


ఈ లోగా మోహన్ బృందం జీప్ ను చేరుకున్నారు. అందరూ కలిసి జీప్ ను తిరిగి ఒడ్డుకు చేర్చారు. 


"హ్యాండ్ బ్రేక్ ను ఎవరో కదిలించారు. వాగు వైపు డౌన్ కావడంతో జీప్ జారిపోయింది" అన్నాడు జీప్ డ్రైవర్. 


"ఇది ఖచ్చితంగా దయ్యం పనే" అన్నాడు రంగయ్య. 


"అదేం కాదు. ఇందాక జీప్ ను స్టార్ట్ చేసి, తీసుకుని వెళ్లాలని ఎవరో ట్రై చేశారు. కానీ వీలు పడక, వదిలేసారు. బహుశా ఆ వ్యక్తికి అంతగా డ్రైవింగ్ రాక పోయి ఉండవచ్చు. మురళి ఆ ఆకారాన్ని ఇందాక చూసి ఉండటంతో ఇప్పుడు కూడా ఆ ఆకారం డ్రైవింగ్ సీట్ లో ఉన్నట్లు భ్రమ పడి ఉంటారు. " అన్నాడు మోహన్. 


"మీ పోలీసులు ఇలాగే అంటూ వుంటారు. పోయే ప్రాణాలు పోతూ ఉంటాయి. మీదేం పోయింది. ఏదోకటి రాసి కేసు క్లోజ్ చేస్తూ ఉంటారు" అన్నాడు మురళి కోపంగా. 


"మురళీ! మోహన్ మంచివాడు. దయ్యం కనపడిందని ఉదయం నేను మా అబ్బాయి చేత కబురు పంపితే వెంటనే విచారణ ప్రారంభించాడు. ఒత్తిడి లేకపోయినా ఈ రోజే, ఈ తుఫాన్ వానలో వాగు దాటి వచ్చాడు" అన్నాడు స్వామినాథం. 


తరువాత మోహన్ వంక తిరిగి, "గతంలో.. పదేళ్ళక్రిందట దయ్యం వచ్చినప్పుడు చనిపోయిన వాళ్లలో మురళి వాళ్ళ నాన్న ఉన్నాడు. అప్పట్లో సరిగ్గా విచారించకుండానే కేసు క్లోజ్ చేశారు. ఆ కోపంలో అలా మాట్లాడాడు. " అన్నాడు. 


మురళి, మోహన్ కు విష్ చేసి, "నమస్తే సర్, నాపేరు మురళీదయాళు. నెల్లూరులో లా చదువుతున్నాను. నేను దయ్యాలను నమ్మను. అందుకే ఇందాక అమ్మతో వాగు దాటేటప్పుడు ఆ జీపులో ఉన్న ఆకారాన్ని ఫోటో తీసాను. దయ్యమైతే ఫొటోలో పడదు కదా. కానీ ఆ ఆకారం ఫొటోలో పడింది. అమ్మకు చూపించాను. ఇప్పుడుకూడా జీపును నీళ్ళలోకి నెట్టాలని చూసింది ఆ ఆకారం. నేను దాన్ని తోసేసి జీపును ఆపాను. " అని చెప్పాడు. 


"ఒక్కసారి నువ్వు తీసిన ఆ జీప్ ఫోటో చూపిస్తావా" అడిగాడు ఎస్సై మోహన్. 


తన జేబు తడిమి చూసాడు మురళి. మొబైల్ కనపడలేదు. 


'ఇందాక ఆ దయ్యంతో పెనుగులాటలో జీపులో పడిపోయిందేమో.. " అంటూ జీపంతా వెదికాడు. మొబైల్ కనపడలేదు. 


"అయ్యో.. ఫోన్ పోయినందుకు బాధ లేదు. కానీ ‘దయ్యం పేరుతొ మనిషి తిరుగుతున్నాడు’ అనడానికి ఉన్న ఆధారం పోయిందని బాధగా ఉంది" అన్నాడు మురళి. 


"మనిషయితే ఎంతకాలం తప్పించుకోగలడు.. పైగా మన మోహన్ పట్టు పట్టాడు కదా. ఇక అంతు చూసేదాకా నిద్రపోడు" అన్నాడు స్వామినాథం. 


ఇప్పటికే చీకటి పడింది. ఇప్పుడు వాగు దాటడం మంచిది కాదు. జీప్ లో టౌన్ కు రండి. స్టేషన్ కు ఎదురుగా ఉన్న లాడ్జిలో రూములు అరేంజ్ చేస్తాను" అన్నాడు మోహన్. 


"మా ఇంట్లో కూడా కొందరు ఉండవచ్చు. రంగయ్యా.. నువ్వు మా ఇంటికే రా" అన్నాడు స్వామినాథం. 


మురళి తన స్నేహితుడు శేఖర్ కు కాల్ చేసాడు. 

"అమ్మను ఇంటి దగ్గర దించేసావా. చాలా సంతోషం. మేము జీపులో టౌన్ కు వెళ్తున్నాము. రాత్రికి అక్కడే ఉండి, తెల్లారాక వస్తాము. అమ్మకు ఈ మాట చెప్పు. " అన్నాడు. 


"దయ్యం సంగతి ఏమైందంటావా.. అది పారిపోయింది" అన్నాడు మురళి. 


"రేపు టీవీ వార్తల్లో దయ్యం గురించి వస్తుందని చెప్పు" అన్నాడు స్వామినాథం. 


ఫోన్ పెట్టేసి, “టీవీలో వస్తుందా.. " ఆశ్చర్యంగా అడిగాడు మురళి. 


"అవును. మా మేనల్లుడు టీవీకి రిపోర్టర్ కదా. నేను ఎస్సైగారితో తొమ్మిదోమైలు వచ్చినట్లు తెలుసుకున్నాడు. ఇప్పుడే మా అబ్బాయి ఫోన్ చేసి 'మీకోసం టీవీవాళ్ళు వెయిటింగ్' అన్నాడు. 

'ముందు మమ్మల్ని క్షేమంగా తిరిగిరానీ' అన్నాను. " చెప్పాడు స్వామినాథం. 


ఆలోచనలో పడ్డాడు మోహన్. మీడియా దృష్టికి ఈ విషయం వెళ్తోందన్న మాట. ఒక రకంగా మంచిదే. విషయం మరుగున పడకుండా ఉంటుంది. కానీ అనవసరమైన వ్యాఖ్యానాలు, పోలీసుల పైన విసుర్లు మొదలవుతాయి. జీపులో కూర్చున్నాక ఆ మాటే అన్నాడు స్వామినాథంతో. 


"మంచిగా రాస్తే జనాలు చదవరు. చూడరు. అయినా రిపోర్టర్ మా వాడే కదా. నీ సిన్సియారిటీని, ధైర్యాన్ని మెచ్చుకుంటూ రాయమంటానులే. ఉన్నమాట కదా" అన్నాడు స్వామినాథం. 

జీపు తొమ్మిదోమైలు దగ్గరకు వచ్చింది. 


'అదుగో.. ఆ చెట్టుకు కాస్త ముందే.. డ్రైవర్ రాజు దయ్యం కనపడిందంటూ కారును ఆపింది" చెప్పాడు స్వామినాథం ముందు వైపుకు చెయ్యి చూపిస్తూ.. 


జీప్ హఠాత్తుగా ఆగింది. 


"ఏమైంది.. ఏమైనా కనిపించిందా" ఆతృతగా అడిగాడు రంగయ్య. 


'ఆ చెట్టు వెనక ఏదో తెల్లగా కనిపించింది. మనం ముందుకు వెళ్లి ఉంటే సరిగ్గా ఆ ప్లేస్ లో రోడ్ కు అడ్డంగా వచ్చేది" అన్నాడు డ్రైవర్. 


అటువైపు నిశితంగా చూసాడు మోహన్. జీప్ హెడ్ లైట్ల వెలుగులో ఆ చింత చెట్టు కొమ్మలు గాలికి ఊగుతూ భయం కలిగిచేట్లుగా వుంది. అది చాలా పెద్ద చెట్టు. దాని వెనక నలుగురైదుగురు దాక్కున్నా ఇటునుండి వచ్చేవాళ్లకు కనపడరు. 


"రిస్క్ వద్దు మోహన్. వెనక్కి తిప్పుకుని కండ్రిగ దగ్గరకు వెళ్దాం. అక్కడ వెయిట్ చేసి ఇటువైపు ఏదైనా బస్సు వస్తుంటే దానితో కూడా వెళ్దాం" అన్నాడు స్వామినాథం. 


"తగ్గేదిలేదు. ఎంతసేపని ఉగుసలాడుతూ ఉంటాం? ముందుకే వెళ్దాం. ఇందరం ఉన్నాము కదా. కూడా పోలీసులు ఉన్నారు. అసలు పోలీసు జీపును చూసి వాళ్ళు పొలాల్లోకి పారిపోయి ఉంటారు" అన్నాడు మురళి. 


ముందుకే వెళ్ళమన్నాడు మోహన్. సరిగ్గా చింత చెట్టును సమీపించాక పెద్ద కొమ్మ ఒకటి విరిగి జీపు ముందు పడింది. సడన్ బ్రేక్ తో జీప్ ను ఆపాడు డ్రైవర్. దూరంగా పొలాల్లో ఉన్న ఒక తెల్లటి ఆకారం జీపు వైపు వేగంగా రాసాగింది. 

***

సరిగ్గా ఆరు నెలలకు ముందు.. 


అది తమిళనాడు బార్డర్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గౌతమ్ తన ఫ్రెండ్స్ తో ఒక ప్రపోసల్ చేసాడు. 


"కొద్ది రోజుల్లో మనమంతా విడిపోతున్నాం. అందరం కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం" అన్నాడు. 


"అందరం అంటే?" అడిగాడు శివ. 


"మన ఫ్రెండ్స్ ఐదారుగురం, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దాం" అన్నాడు గౌతమ్. వాస్తవానికి అతను రితిక అనే అమ్మాయిని చాలా రోజుల్నుంచి లవ్ చేస్తున్నాడు. ప్రపోజ్ చెయ్యడానికి తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. 


"సరేరా. మన ఫ్రెండ్స్ అందరికీ చెబుతాను. ఒక టెంపో అరేంజ్ చేసుకుందాం. ముందు నీ ఫ్రెండ్.. అదే ఆ రితికాను ఒప్పించు. ఎప్పుడూ మూడీగా ఉంటుంది " అన్నాడు శివ. 


"ఒప్పిస్తాను. అంతేకాదు. టూర్ ముగిసేలోగా ప్రపోజ్ చేస్తాను" అన్నాడు గౌతమ్. 


మరుసటి రోజు క్లాస్ నుండి బయటకు వస్తున్న రితికను ఆపాడు గౌతమ్. 



"రితికా.. మన ఫ్రెండ్స్ ఒక చిన్న టూర్ వెళ్లాలని ప్రపోజ్ చేశారు. నువ్వు కూడా తప్పకుండా రావాలి" అన్నాడు తనతో కూడా నడుస్తూ. 


"అది నీ ప్లాన్ అని అంటున్నారు.. " అంది రితిక అతని వంక చూసి నవ్వుతూ. 


"అలానే అనుకో.. కాదనవుగా" ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. 


"ఎక్కడికి వెళ్దాం.. ?" అడిగింది రితిక. 


"ఇంకా డిసైడ్ చెయ్యలేదు. నువ్వేదైనా సజెస్ట్ చేస్తావా?" అడిగాడు గౌతమ్. 


"మా ఊరికి దగ్గరలో శివయ్య కోన అని ఒక వాటర్ ఫాల్స్. చాలా బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు. "


"సారీ. ఇన్నేళ్ల పరిచయంలో నిన్ను అడగనే లేదు.. మీ వూరు పేరేమిటి?"


"వేటపాలెం"


"ఎక్కడది?" 


"తొమ్మిదో మైలు దగ్గర" చెప్పింది రితిక. 


"ఆ తొమ్మిదో మైలు ఎక్కడ?"


"మా ఉరికి దగ్గర.. " చెప్పి కిలకిలా నవ్వింది రితిక. 


“ఇక్కడినుంచి జలపాతం యాభై కిలోమీటర్లు. అక్కడినుండి ఓ ఐదు కిలోమీటర్లలో మా ఊరు" చెప్పింది రితిక. 


"మీ ఊరి స్పెషాలిటీ ఏమిటో.. " అడిగాడు గౌతమ్. 


"ఏముందబ్బా.. " పెదవిపైన చూపుడు వేలితో తడుతూ ఆలోచించ సాగింది రితిక. 


"మీ వూరి అమ్మాయిలు చాలా చాలా అందంగా ఉంటారు. ఆ విషయం తెలుసు. ఇంకేదైనా చెప్పు" అన్నాడు గౌతమ్ ఆమె కళ్ళలోకి కొంటెగా చూస్తూ.

 

"మా వూరి అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు. అందుకే మా వూరి అమ్మాయిలు బయటి వాళ్లకు పడరు." అంది రితిక నవ్వుతూ. 


"మీ వూరి స్పెషాలిటీ నా కొంప ముంచేటట్లుగా ఉంది" అన్నాడు గౌతమ్. 


ఆ మాటలు విననట్లు "మా ఊరికి ఇంకో స్పెషాలిటీ ఉంది" అంది రితిక. 


"ఏమిటో అది.. "


"ఓ పదేళ్ల కిందట దయ్యాలు మా ఊర్లో కొందరిని చంపేశాయట. అప్పట్లో పేపర్లలో, టీవీలో ఆ వార్తలే రోజూ వచ్చేవట" చెప్పింది రితిక. 


"అయితే మన బ్యాచ్ కి మూడిందన్నమాట. అందరికీ మీ ఊర్లో డిన్నర్ అరేంజ్ చెయ్యి. దయ్యాలకు మనమే డిన్నర్" అన్నాడు గౌతమ్ నవ్వుతూ. 


=========================================================

ఇంకా ఉంది

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments


bottom of page