top of page

కార్తీక పౌర్ణమి - జ్వాలాతోరణం

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #తెలుగుభక్తికథలు, #KarthikaPournamiJwalaThoranam, #కార్తీకపౌర్ణమిజ్వాలాతోరణం


Karthika Pournami Jwala Thoranam - New Telugu Story Written By Sudhavishwam Akondi Published In manatelugukathalu.com On 06/11/2025 

కార్తీక పౌర్ణమి - జ్వాలాతోరణం - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

"కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాఃజలే స్థలే యే నివసంతి జీవాః!

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!"


కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించి ఈ శ్లోకం చదివి, దీపాలకు నమస్కారం చేయాలి. 

జన్మలన్నిటిలో మానవ జన్మ శ్రేష్టమైనదని అంటారు. మానవునికే ఒక ప్రత్యేక శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఈశ్వర నామం పలికి, శరీరంతో పరమేశ్వరుని సేవ చేసి ముక్తిని పొందే అవకాశం ఉంది. కానీ ఇతర జీవరాశులకు ఆ సౌలభ్యం లేదు. మరి అవి కూడా ఉద్ధరింపబడాలంటే మానవులే సహాయం చేయగలరు. తమ తోటి జీవులను కూడా ఉద్ధరించేలా చేయాల్సిన బాధ్యత మానవుడిది. 


అందుచేత కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించి ఈ శ్లోకం చదవాలి అని నిర్దేశించారు. 


 కీటకాలు, పశుపక్ష్యాదులు మొదలుకుని అన్ని జీవరాశులు ఈ దీపాలను చూస్తే ముక్తిని పొందుతాయని తెలియజేస్తుంది ఈ శ్లోకం. పురుగులు, దోమలు, ఈగలు ఇలాంటి ఏ కీటకాలు అయినా దీపం వైపు ఎగిరివస్తే మోక్షం తథ్యం. దీపం వెలుగు ఎంత దూరం పడుతుందో, ఆ దీపాన్ని ఎవరెవరు చూస్తున్నారో అవన్నీ మరణానంతరం భగవంతుడి సన్నిధికి చేరుకుంటాయని అర్థం. 


తాము వెలిగించిన ఈ దీపాలు సకల జీవులను ఉద్ధరించుగాక అని కోరుకుని, దీపంలో వున్న భగవంతునికి నమస్కరించాలి. 


దీపం వెలిగించి దీప శిఖలో శివ కేశవులను ఆవాహనం చేసి దీపానికి అక్షింతలు వేసి నమస్కరించాలి. జ్వారా తోరణం రోజు వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది. 


కార్తీక మాసంలో దేవాలయాల్లో జ్వాలా తోరణాన్ని వెలిగిస్తుంటారు. ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. గరుడ పురాణంలో దీని ప్రస్తావన ఉందని పెద్దలు చెబుతారు. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే మొదటి శిక్ష. 


అయితే కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి, ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతి సహితుడైన పరమేశ్వరుడిని పల్లకిలో కూర్చోబెట్టి, అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకీ తో పాటుగా భక్తులు కూడా దాటుతారు. 


ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది ఈ అగ్ని తోరణమే. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందనేది పురాణ వచనం. 


అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలేనది శాస్త్ర వచనం. 


దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ దాటితే ఈశ్వరుడి చెంత తన తప్పులు ఒప్పుకుని, మళ్లీ చేయమని ప్రమాణం చేయడం అనే అర్థం కూడా ఉంది. 


‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా!" అని ప్రతీకాత్మకంగా చెప్పటమే ఈ జ్వాలా తోరణం ఉద్దేశ్యం. 


జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత పిశాచాలు ఇంటిలోకి రావని ప్రగాఢ నమ్మకం. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. 

 కార్తీక పౌర్ణమి లోని అంతరార్థం ఇది. 


శ్రీకృష్ణార్పణమస్తు



-సుధావిశ్వం





Comments


bottom of page