top of page

ఖైదీ కాపురం - పార్ట్ 1

Updated: Oct 18, 2025

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #ఖైదీకాపురం, #KhaidiKapuram

వారంవారం కథల పోటీలో బహుమతి పొందిన కథ


Khaidi Kapuram - Part 1/2 - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 03/09/2025

ఖైదీ కాపురం - పార్ట్ 1/2 - పెద్ద కథ ప్రారంభం

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

పెన్నా నది గట్టు మీదున్న పెన్నోలు గ్రామంలో పెళ్లి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికుమారుడు రవిచంద్ర ఇంటి ముందర అందమైన పెళ్ళి పందిరి వేసివుంది. పెళ్లి కోసం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో వివాహ వేదికను నిర్మించి షామియానాలు వేశారు. 


సాయంత్రం ఆరు గంటలు అయింది. కందవోలు నుంచి పెళ్లికుమార్తె సంధ్య బంధుమిత్ర సకుటుంబ సమేతంగా వచ్చి ఊరి రామాలయంలో పెళ్లికుమారుని రాకకై ఎదరుచూస్తూ వేచి ఉంది. 


పెళ్లికుమారుడు రవిచంద్ర ముస్తాబై తల్లిదండ్రులతో అక్కాబావలతో బంధుమిత్రాదులతో ఊరి జనంతో కలిసి మంగళవాయిద్యాలు వెంటరాగా పెళ్లి కుమార్తెను తోడుకొని రావడానికి రామాలయానికి బయలుదేరాడు. 


రామాలయంలో సీతా రామ లక్ష్మణ ఆంజనేయులకు పూజలు చేసి నూతన వధూవరులు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు. అలంకరించిన వాహనంలో కుర్చోని, తప్పెట్లు మేళాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా కదిలింది వాహనం. కర్ర త్రిప్పుతూ, కర్రసాము చేస్తూ, చిందులు తొక్కుతూ ఊరేగింపు వీధి గుండా సాగిపోయి పెళ్లి వేదిక వద్దకు సమీపించింది. వధూవరులు వేదికపైకి చేరుకున్నారు. 


పెళ్లికూతురికి పెళ్లికొడుక్కి, పెళ్లికి వచ్చినవారు బహుమతులు, కానుకలు ఇచ్చి ఫోటోలు దిగడం రాత్రి తొమ్మిది గంటల వరకు సాగి, భోజనాలతో ఆనాటి పెళ్లి సంబరాలు ముగిశాయి. 


మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకే పెళ్లిసందడి మళ్లీ మొదలైంది. వధూవరులకి నలుగు పెట్టి మంగళస్నానం చేయించారు. తొమ్మిది గంటలకు సుముహూర్తం. 


పురోహితుడు వేదికపై ఏర్పాట్లు చేస్తున్నాడు. వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు దగదగ మెరిసిపోతున్నారు. చూసిన వారందరూ చక్కని వీడు జోడు అనుకుంటున్నారు. ఇంతలో పురోహితుడు పిలుపు మేరకు వధూవరులు వేదిక ఎక్కి పెళ్లిపీటల మీద కుర్చున్నారు. 


పెళ్లికొడుకు పెళ్ళికూతురు ఒకరికొకరు కాలివేళ్లకు మెట్టెలు తొడుక్కున్నారు. సరిగ్గా తొమ్మిది గంటల సుముహూర్తానికి పెళ్లికూతురు మెడలో పెళ్లికొడుకు తాళి కట్టి మూడు ముళ్లు వేశాడు. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకొని సంధ్య రవిచంద్రలు భార్యాభర్తలైయారు. నూతన దంపతులకు అరుంధతి నక్షత్రం చూపించే సరికి పన్నెండు అయింది. 


అంతటితో పెళ్లి తంతు ముగిసి అందరూ భోజనాలకు కుర్చున్నారు. రెండు బంతులు లేచేటప్పుటికి సర్రున నిండా పోలీసులతో జీపొచ్చి పెళ్లి ఆవరణలో నిలిచింది. పెళ్లి జనంలో కలకలం ఆందోళన మొదలైంది. 


ఎస్ఐ రాంగోపాల్ ప్రశాంతంగా జీప్ దిగి రవిచంద్ర తల్లిదండ్రులైన రామసుబ్బయ్య సీతమ్మల దగ్గరకు నడిచోచ్చి నమస్కారం చేశాడు. సంధ్య తల్లిదండ్రులైన సుబ్బరామయ్య నాగలక్షుమ్మ, బంధువర్గం చుట్టూ మూగారు. పెళ్లికొచ్చిన జనంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. 


"రామసుబ్బయ్య గారు! మీరు, మీ కుటుంబం చాల మంచివారండి. మీకు ఈ చుట్టూ ఉన్న పల్లెల్లో కూడా మంచి పేరు ఉంది. మీ అబ్బాయి రవిచంద్ర కూడా మీలాగే చాల నీతిమంతుడు. అయినా మంచివారికే కష్టాలు వస్తుంటాయి. వివాహ ఉత్సాహంలోనే దుర్వార్త చెప్పాల్సిరావడం నా దురదృష్టం" అని చెప్పుకున్నాడు ఎస్ఐ రాంగోపాల్. 


ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉన్నారంతా. 

"నాగాయపల్లెలో మీకు బంధువులు ఉన్నారు కదా! వారికి క్రిష్ణంపల్లె వారికి ఎప్పుటినుంచో ముఠా తగాదాలు ఉన్నాయి. అటు వైపు ఇటు వైపు ఎన్నో హత్యలు జరిగినాయి. ఆ విషయం మీకూ తెలుసు. నాగాయపల్లె మనుషులు ఈ మధ్యనే క్రిష్షంపల్లెకు చెందిన నలుగురు మనుషుల్ని హత్య చేశారు. అది ఎంత పెద్ద సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. 


క్రిష్ణంపల్లెవారు పదిమంది నాగాయపల్లె మనుషులపై కేసు పెట్టారు. నాగాయపల్లె వారికి మీరు బంధువులు కాబట్టి కేసులో మీ అబ్బాయి రవిచంద్రను కూడా చేర్చారు". అని ఎస్ఐ రాంగోపాల్ చెప్పగానే ఇరు కుటుంబాలవారు, పెళ్లికి వచ్చినవారు హతాశులై పోయారు. 


"ఆ కుటుంబం వారు చాల ఉత్తములు. ఎవరి జోలికి పోరు. అలాంటి వారిపై కేసు పెట్టడం న్యాయం కాదు" అని మేము అడిగాం. 


"మంచి వారు కాబట్టే కేసుతో సరిపెట్టుకున్నాం. లేకపోయింటే ఎప్పుడో చంపేసేవాళ్ళం" అన్నారు. 


"మేము రాజ్యాంగ బద్దులం కాబట్టి అరెస్టు చేయడానికి వచ్చాం" అని చెప్పడంతో వివాహ ప్రాంగణంతా విషాదంతో నిండి పోయింది. కొందరిలో రోదనలు మొదలైనాయి. 


"మేము వాళ్ళకు ఎప్పుడూ అపకారము తలపెట్టలేదు. మాపై కేసు పెట్టడం అన్యాయం" అన్నాడు రామసుబ్బయ్య. 


దానితో అక్కడున్న పెద్ద మనుషులు కూడా "చుట్టాలు అయినంత మాత్రాన వీరిపై కేసు నమోదు చేయడం సరికాదు" అన్నారు. 


"అదే విషయం మేమూ చెప్పాం. వాళ్ళు సస్సేమిరా వినలేదు. చివరికి అరెస్టు చేయడానికి రావాల్సి వచ్చింది" ఎస్ఐ రాంగోపాల్ చెప్పాడు మధనపడుతూ. 


పెళ్ళికొడుకు రవిచంద్ర జోక్యం చేసుకొంటూ "ఎస్ఐ గారు! మాకు కొంత సమయం ఇవ్వండి. మేము మాట్లాడుకొని మీకు తెలియజేస్తాం! సమయానికి వచ్చారు. భోజనం చేయండి" కోరాడు. 


"రవిచంద్రా! మీ మీద మాకు నమ్మకం ఉంది. వారమో! పది రోజులో టైం తీసుకోండి. మాట్లాడుకొని ఒక నిర్ణయం రాండి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అప్పుడు ఫోన్ చేయండి. మేము వస్తాం లేదా మీరే స్టేషనుకు వచ్చి లొంగిపోండి. అయితే పది రోజుల గడువు లోపల అంతా జరిగి పోవాలి" ఎస్ఐ రాంగోపాల్ గట్టిగా చెప్పాడు. 


"ధన్యవాదాలు సార్! మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయ్యను సార్. " కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రవిచంద్ర. 

 

"పోలీసులు ఇలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వరు. ఈ అవకాశం మీకు మాత్రమే. జాగ్రత్తగా ఉపయోగించుకోండి రవిచంద్రా!" మరోసారి జాగ్రత్తలు చెప్పి ఎస్ఐ, పోలీసులు భోజనం చేసి వెళ్ళిపోయారు. 


సాయంత్రం రెండు కుటుంబాలు ఒక చోట కూర్చొని చర్చించుకున్నారు. ముందుగా రామసుబ్బయ్య మాట్లాడుతూ "మేము ఖూనీ చేసిన వారికి చుట్టిరికం ఉన్న కారణంగా మాపై ఖూనీ కేసు పెట్టడం మా దురదృష్టం. ఈ కేసు నుంచి మా వాడు బయట పడతాడో జీవితఖైదు అయితాడో చెప్పలేం. కాబట్టి ఈ పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదో తేల్చండి బావ గారు!" వియంకుడైన సుబ్బరామయ్యను ఉద్దేశించి అన్నాడు. 


పెళ్లి కొడుకు అమ్మ సీతమ్మ‌ కూడ "పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మావాడి కారణంగా మీ అమ్మాయి భవిష్యత్తు దెబ్బ తినకూడదు. కాబట్టి మీ మాటే మా మాట" అంది బాధను దిగమ్రింగుతూ. అందరూ విషాదంగా, ఆందోళనగా వింటున్నారు. 


"బావగారూ! ఒక ఆడపిల్ల తండ్రిగా నా కూతురు క్షేమం సుఖం నేను కోరుకుంటాను. మీ అబ్బాయికి జీవిత ఖైదు పడితే నా కూతురు బతుకు అధ్వానం అయిపోతుంది. కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటేనే మంచిది అని నా అభిప్రాయం. అయితే ఈ మాట చివరిది కాదు. అమ్మాయి మాటే చివరిది. " చెప్పాడు సుబ్బరామయ్య. 


"నా భర్త చెప్పిన మాటనే తన మాట కూడా " నాగలక్షుమ్మ కూడా భర్త మాటనే సమర్థించింది. 


"పెళ్లి పేరుతో అణ్యం పుణ్యం ఎరుగని ఆడబిడ్డను నిర్బంధించ కూడదు. " రవిచంద్ర అక్కాబావ అభిప్రాయం వెలిబుచ్చారు. 


పెళ్లికొడుకు రవిచంద్ర "మామా గారు! మీరు అక్షరాలా నిజం చెప్పారు. నాకు జీవితకాలం జైలు శిక్ష పడితే మీ అమ్మాయి జీవితం నిజంగానే ఆగమైపోతుంది. అభం శుభం ఎరుగనిది. మీ కూతురు జీవితమంతా నిస్సారంగా నిస్తేజంగా గడపడం నేను ఒప్పుకోను. కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసుకుందాం" నిష్కర్షగా నిర్ద్వంద్వంగా చెప్పాడు. 

ఇరువర్గాలలో పరిస్థితి ఉద్వేగభరితంగా మారిపోయింది. ఇక పెళ్లి కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని జనంలో ఊపిరి సలపని ఉత్కంఠ నెలకొంది. సంధ్య అభిప్రాయం కోసం అందరూ ఆసక్తిగా ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. 


"అమ్మా సంధ్యా! ఈ పరిస్థితుల్లో నీ నిర్ణయం ఏమిటమ్మా! నీవు బాగుపడే నిర్ణయం తీసుకో తల్లి. తల్లిదండ్రులుగా మేము కోరుకొనేది నీ క్షేమమూ నీ సుఖమేనమ్మా!" అని ఆమె తల్లిదండ్రులు చివరి మాటగా చెప్పారు. 


"ఇంత వైభవంగా వివాహం జరిగి, ఇంతమంది మధ్య మంగళసూత్రం కట్టించుకుని, ఇందరి ఆశీస్సులతో తలంబ్రాలు పోసుకొని, ఇంత గొప్ప అన్నసంతర్పణ జరిపి ఇప్పుడు ఏదో ఇబ్బంది ఏర్పడిందని పవిత్రమైన వేదమంత్రాలతో జరిగిన పెళ్లిని రద్దు చేసుకుందామా!


కష్టం వచ్చిందనో, నష్టం జరిగిందనో, బాధ కలిగిందనో, జీవితం వేదనా భరితమైందనో పెళ్లిళ్లు రద్దు చేసుకుంటూ పోతే ఇన్ని జంటలు ఇంతకాలం కలిసి ఉండేవా! 


అంతెందుకు అమ్మానాన్న, అత్తామామ తమ జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొని ఉంటారు. అయినా కలిసే ఉన్నారు కదా! మరి మమ్మలెందుకు విడి పొమ్మంటున్నారు. మేమూ కూడా ఆరమైనా భారమైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కలిసే ఉంటాం" సంధ్య తెగేసి చెప్పింది. 

"అది కాదు సంధ్యా! మనకు ఇప్పుడే పెళ్లైంది. ఇంకా ఏమీ జరగలేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడానికి పూర్వ పరిచయమూ లేదు. మొన్నటి వరకు నీవెవరో నేనెవరో కదా! కాబట్టి విడిపోదాం. నా దురదృష్టానికి నీవెందుకు బలి కావాలి. రద్దు చేసుకుని నీవైనా సుఖపడు. నాతో ముడిపెట్టుకొని నీ బంగారు జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు సంధ్యా" పరిపరివిధాల నచ్చచెప్పి చూశాడు రవిచంద్ర. 


"మన మధ్య ప్రేమ లేదా! ఉంది!. నీకు నేనెవరో తెలియక నువ్వు నన్ను ప్రేమించలేలేదూ. నీవెవరో నాకు బాగా తెలుసు. రెండేళ్లుగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ విషయం మన మొదటి రాత్రి చెప్పి నిన్ను ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. కానీ విధి ఇప్పుడే చెప్పిస్తుంది. 


రెండేళ్ళ క్రితం నిన్ను 'చెప్పలి' తిరునాళ్ళో తొలిసారి చూశాను. తిరునాళ్ళో నువ్వు నీ మిత్ర బృందంతో చెక్కభజన ఆడావు. నేను నా స్నేహితురాళ్ళతో చెప్పలి తిరునాళకొచ్చి నిన్ను చూశాను. అప్పుడే నీ రూపం నా హృదయంలో తిష్ట వేసి కూర్చుంది. మేమందరం నీతో మాట్లాడాం. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ సెల్లుతో ఫోటో కూడా తీసింది. 


మళ్లీ మనం 'పుష్పగిరి' బ్రహ్మోత్సవాల్లో కలిశాం. అక్కడ మీ ట్రూప్ కోలాటం ప్రదర్శించారు. అక్కడ కూడా నీతో మాట్లాడాం. అప్పుడు కూడా నీకు తెలియకుండానే ఫోటో దిగాం. ఆ తరువాత మళ్లీ మాకు బ్రహ్మంగారి ఆరాధనోత్సవాల్లో 'జడకోపు' గాన రూపమైన ఆటకు అడుగులేస్తూ నిండు చంద్రునిలా కనిపించావు. నాకు మనసు ఉప్పొంగిపోయింది. 


మేము నీతో పరిచయం చేసుకున్నాం. మీ పేరు, ఊరు అడిగి తెలుసుకున్నాం. అక్కడ మాత్రం నిన్ను అడిగే మేమందరం ఫోటో దిగాం. ప్రదర్శన అనంతరం ఎందరో ప్రజలు మిమ్మల్ని అభినందించడానికి చుట్టుముట్టుతారు కాబట్టి ప్రత్యేకించి మమ్మల్ని గుర్తు పెట్టుకోలేక పోయారు. 


నేను ఇంటికొచ్చి మా అన్నకు మీ ఊరు, పేరు చెప్పి, నీ ఫోటో చేతికిచ్చి, మీ బ్యాగ్రౌండ్, మీ క్యారెక్టర్ ఏమిటో విచారించమని అడిగాను. విచారణలో నువ్వు ఎంత అందంగా ఉంటావో, అంత మంచిది నీ క్యారెక్టర్ అని, మీ కుటుంబం కూడా చాల గౌరవప్రదమైందనీ తేలింది. 


ఇంకా ఆలస్యం చేయకుండా మా నాన్నకు చెప్పి, మధ్యవర్తిని మీ ఇంటికి పంపి సంబంధం ఖాయం చేసుకున్నాం. ఫలితంగా ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు ఏదో ఆటంకం ఎదురైందని వెనక్కి తగ్గమంటారా! తగ్గితే నా ప్రేమకు విలువ ఏముంటుంది. వివాహ పవిత్రత ఏంగావాలి. అది కానిపని గానీ తరువాత కార్యక్రమం ఏమిటో చేయండి" 


మరో మాటకు తావు ఇవ్వకుండా చెప్పి రవిచంద్రకు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు అందించింది సంధ్య తన ప్రేమకు రుజువుగా. 


"అమ్మాయి ఇంత ధృడంగా స్థిరంగా ఉన్నప్పుడు మేం మాత్రం ఏమీ చెయ్యగలం. దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తర్వాత తంతు జరుపుతాం" ఇక విధిలేక పలికారు సంధ్య తల్లిదండ్రులు సుబ్బరామయ్య, నాగలక్షుమ్మ. 


"ఇంతటి దృఢచిత్తం కలిగిన అమ్మాయి కోడలు కావడం మా అదృష్టం" సంతోషించారు రామసుబ్బయ్య సీతమ్మలు. 


రవిచంద్ర కూడా ఇంకేమి మాట్లాడలేక మౌనం వహించాడు. 

రవిచంద్రకు, అతని తల్లిదండ్రులకు ధైర్య వచనాలు చెప్పడానికి నాగాయపల్లె ముద్దాయిల తరుపున వచ్చిన లాయర్ రంగనాథ్ జరుగుతున్న చర్చను ఆసాంతం విన్నాడు. పెళ్లికూతురు స్థిరచిత్తాన్ని, వివాహం పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలుసుకుని సంతోషించాడు. 


సంధ్యతో లాయర్ రంగనాథ్ మాట్లాడుతూ "అమ్మా సంధ్యా! వివాహబంధంపై నీకున్న అసంచలమైన విశ్వాసానికి నిన్ను అభినందిస్తున్నాను తల్లీ! నేను మీ కేసు వాదించబోయే లాయర్ రంగనాథును. నీ నమ్మకాన్ని గెలిపించడానికి ప్రయత్నిస్తొను. రెండు మూడు నెలల్లో బెయిల్ తెస్తాను. 


కేసును పది పన్నెండేళ్ళ పాటు తీర్పుకు రాకుండా లాగుతాను. ఈలోపు మీకు పిల్లలు పుట్టి దాదాపు పెద్ద పిల్లలు అవుతారు. ఆ తరువాత కూడ రవిచంద్ర నిరపరాధిగా బయటపడవచ్చు. ఒకవేళ శిక్ష పడినా అనేక సందర్భాల్లో అనేక కారణాలతో ఇంటికి వస్తూ పోతుండోచ్చు. సత్ప్రవర్తన వలన శిక్ష తగ్గనూ వచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండమ్మా సంధ్యా!" అని సంధ్య తలపై చేయి పెట్టి దీవించాడు లాయర్ రంగనాథ్. 


ఇక అన్ని అనుమానాలను సంధిగ్ధాలను పక్కన పెట్టి, నూతన దంపతులకు శోభనంలో భాగంగా మూడు రాత్రులు జరిపించారు. నాల్గో దినం ఉదయం పది గంటలకు అమ్మానాన్న, అత్తామామ, బంధువులు సంధ్య వెంట రాగా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాంగోపాల్ సమక్షంలో సరెండర్ అయ్యాడు రవిచంద్ర. 


పోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళు ఉండినా కౌంటుకు రావనీ, అదే జైల్లో ఉంటే రోజులు కౌంటుకు వచ్చి బెయిల్ త్వరగా వస్తుందని ఎస్ఐ రాంగోపాల్ రవిచంద్రను లొంగిపోయిన రోజే కోర్టులో హాజరు పరిచాడు. 


కోర్టులో కేసుకు సంబంధించిన మిగతా ముద్దాయిలు కనిపించారు. వాళ్ళు రవిచంద్ర వద్దకు వచ్చి "రవిచంద్రా! కేవలం మాకు బంధువైన కారణంగా మేము చేసిన పాపం నిష్కారణంగా నీమీద కూడా పడింది. మమ్ములను క్షమించు రవిచంద్రా!" అని క్షమాపణ చెప్పారు. 


"కర్మఫలాన్ని ఎవ్వరైనా తప్పించుకోలేరు. అనుభవించి తీరాల్సిందే. అంతా విధి అనుసారం జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. మీ మీద నాకేమీ కోపం లేదు!" నిర్వేదం గా బదులు పలికాడు. 


"అయినా ముఠా తగాదాల వల్ల ఎన్నో కష్టనష్టాలు పడాల్సి వస్తుంది. ఈ ముఠా తగాదాలు మాని ప్రశాంతంగా బతుకవచ్చు కదా!" అడిగాడు రవిచంద్ర. 


దానికి వాళ్ళు తల వంచుకున్నారు తప్ప జవాబు ఇవ్వలేదు. 

నెలరోజులకు కోర్టులో హాజరు పరచండని కోర్టు తీర్పు చెప్పి ముద్దాయిలందరినీ రిమాండ్ కు పంపింది


జైలు ప్రొద్దుటూరు కోర్టు వెనుక భాగంలోనే ఉండడం వల్ల సంధ్య ప్రతిరోజూ ఉదయం గానీ, సాయంత్రం గానీ భర్తను చూడడానికి వచ్చేది. వస్తూ టిఫినో, పండ్లో తెచ్చేది. వచ్చిన ప్రతిసారీ ధైర్యంగా ఉండమని, సమస్యలు ఎప్పుడూ ఉండవని, మంచి రోజులు వస్తాయని, ఓపిక పట్టాలని చెప్పేది. 


"పరిస్థితి ఇట్లుంటదని నీకు అంతగా చెప్పాను. నువ్వు వినక పోతివి సంధ్యా" విచారపడుతూ రవిచంద్ర అన్నాడు. 


"ఏమి చెప్పావు. విడిచిపొమ్మనా! నువ్వు నా ప్రాణానివి. ప్రాణం విడిచిపెట్టమంటావా! ఏం మాట్లాడుతున్నావు" సంధ్య అనగానే రవిచంద్ర మౌనమైపోయాడు. 


"ప్రతి రోజు ఎందుకు వస్తావు. వస్తూ ఏదోకటి ఎందుకు తెస్తావు. ఇక్కడ పెడ్తున్నారు కదా!" కాస్త విసుగ్గా చెప్పాడు రవిచంద్ర. 


"తొలకర్లు మొదలైతే చేలల్లో పనులు ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రతి రోజూ వచ్చేది ఉండదులే" అంది సంధ్య. 


సంధ్య పుట్టింటి నుంచి ట్రాక్టరును తెచ్చుకొని పొలాలు దుక్కి దున్ని సేద్యం చేసేది. సరదాగా నేర్చుకున్న ట్రాక్టర్ డ్రైవింగు ఇప్పుడు పనికొచ్చింది సంధ్యకు. 


లాయర్ రంగనాథ్ రెండు నెలలకే బెయిల్ తేవడంతో ఇంటిల్లిపాదీ ఆనందంగా జైలుకు వచ్చి రవిచంద్రను ఇంటికి పిలుచుకొచ్చారు. 


అప్పటినుంచి ఎప్పుడో ఒకసారి వాయిదాకు పోయి వచ్చేవాడు రవిచంద్ర. తనపై కేసు ఉన్న విషయమే మరిచిపోయి కుటుంబంతో కలిసి జీవితాన్ని ఆనందంగా గడిపాడు. ఒక యేడాది గడిచాక ఒక మగపిల్లోడు, మరో రెండేళ్లు గడిచేసరికి మరో ఆడపిల్ల పుట్టారు. 


సంధ్యారవిచంద్రుల ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. తల్లిదండ్రుల సంతోషానికి మేర లేదు. అత్తామామల సంబరానికి అవధులు లేవు. కొడుక్కు 'యోచన్' అని, కూతురుకి 'సృజన' అని పేర్లు పెట్టుకొని ముద్దు మురిపెంగా చూసుకుంటున్నారు. 


కేసు తీర్పుకు రాకుండా రకరకాల కారణాలు కోర్టుకు చెప్పుతూ, సాకులు చూపిస్తూ పది సంవత్సరాల పాటు నెట్టుకొచ్చాడు లాయర్ రంగనాథ్. పది సంవత్సరాల కాలం గడిచిన కేసులన్నీ పూర్తి చేయమని ప్రభుత్వం నుంచి జీఓ రావడం వలన కేసు విచారణ కొచ్చింది. లాయర్ రంగనాథ్ ఎంత బలంగా వాదించినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కోర్టు ముద్దాయిలందరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.


తల్లిదండ్రులు బోరున విలపించారు. అత్తామామలు విపరీతంగా బాధ పడ్డారు. తీర్పు రోజు బంధువులు మిత్రులే కాకుండా ఊరుఊరంతా కదిలి వచ్చింది. పోలీసులు రవిచంద్ర తోపాటు ఖైదీలందరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించే ముందు బంధువులతో మాట్లాడుకోవడానికి ఒక గంట అనుమతి ఇచ్చారు. 


"చూశావా సంధ్యా! ఎలా జరిగిందో! విధి వక్రించడం అంటే ఇదే!" దిగులు పడుతూ అన్నాడు రవిచంద్ర. 


"శిక్ష పడిందని చింతనలో కూరుకుపోవద్దు, మానసికంగా క్రుంగి పోవద్దు. శారీరకంగా బలంగా ఉండాలి. జైల్లో ఖైదీలతో స్నేహపూర్వకంగా ఉండు. పోలీసులతో అధికారులతో మంచి ఉండు. ఏ నేరము చేయని వాడికి దేవుడు ఏదోక మేలు చేస్తాడు. సంతోషంగా శిక్ష పూర్తి చేయ్యి. పిల్లలు మీద, ఇంటిమీద బెంగా పెట్టుకోవద్దు" సంధ్య భర్తకు సమయస్ఫూర్తిగా వినిపించింది. 


"నా విషయం సరే సంధ్యా! నువ్వు చిన్న పిల్లలతో, ముసలి అత్తామామలతో ఎట్లా ఏగుతావు. భూములు ఎలా పండిస్తావు. అదే నాకు బెంగగా ఉంది. " విచారపడుతూ అన్నాడు రవిచంద్ర. 


"పిల్లలు మాట వినే ఎడ పిల్లలైనారు. మన ఊర్లోనే టెన్త్ వరకు స్కూల్ ఉంది కాబట్టి వారి సమస్య లేదు. ఇక అత్తామామ మరీ ముసలివారేమి కాదు. ఏబైఐదు ఒకరికి, అరవై ఒకరికి వయసు కాబట్టి గట్టిగానే ఉన్నారు. పొలాలు చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు బీడు కానివ్వం. 


మామూలుగా ఇలాంటి శిక్ష పడినవారు. భూములు బీడ్లు అవుతాయని, పిల్లలు తరంగా కాకుండా పోతారని, ఆడవాళ్ళు చెడి పోతారని అనుకుంటూ ఉంటారు. నీకు చేతిలో చేయ్యేసి చెప్పుతున్నాను. 'ఈ శరీరానికి మలినం కానీయను. మరక అంటనీయను. మానం పోవడమంటే ప్రాణం పోవడమే' అనేది నా విశ్వాసం" నిక్కచ్చిగా ప్రమాణం చేసి చెప్పింది సంధ్య. 


"సంధ్యా! నిప్పు పైన ఈగలు దోమలు వాలుతాయా! మాడిమసైపోతాయి గానీ. అది కాదు నా భయం. సుదీర్ఘ కాలం పాటు మీకు దూరంగా ఉంటాను కదా నువ్వు కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తావు అనేదే నా భయం బాధ" దిగులు పడుతూ చెప్పాడు. 


"అదేమీ ఆలోచించవద్దు. నువ్వు ఉండేది కడపే కాబట్టి మేము ప్రతి ఆదివారం పిల్లలను తీసుకుని అత్తామామలతో వస్తుంటాను. అన్నీ విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం" అంటుండగానే పోలీసులు టైం అయ్యింది రమ్మని పిలిచారు. 


"నాన్నా! అమ్మా! మీరు పిల్లల్ని చూసుకుంటూ సంధ్యకు అండగా ఉండండి. అని అమ్మా నాన్నను గుండెలకు హత్తుకున్నాడు. ' సరే నాయినా! నువ్వు జాగ్రత్తగా ఉండు నాయినా!' రోదిస్తూ అన్నారు. 


పిల్లలను ఎత్తుకొని ముద్దుపెట్టి 'మీరు అమ్మ మాట వింటూ బాగా చదువుకోండి' అని చెప్పాడు. 


భార్యను దగ్గరకు తీసుకుని “నీమీద మోయలేని భారం మోపి పోతున్నాను. నీవే నా ఆత్మవు. నా ఆధారం" అని చెప్పి భార్య చెంపలెమ్మడి కారిపోతున్న కన్నీటిని తుడిచి పోలీసు జీప్ ఎక్కాడు రవిచంద్ర. జీప్ కదిలి కనుమరుగైంది. భారమైన హృదయాలతో ఇల్లు చేరారందరూ. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments


bottom of page