top of page

మాధవా! నీకు తోడుగా..

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మాధవానీకుతోడుగా, #భాస్కరుడు

గాయత్రి గారి కవితలు పార్ట్ 30

Madhava Niku Thoduga - Gayathri Gari Kavithalu Part 30 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 27/06/2025

మాధవా! నీకు తోడుగా - గాయత్రి గారి కవితలు పార్ట్ 30 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


మాధవా! నీకు తోడుగా...

(కవిత)

**********************************


పదాల పదనిసలు 

(1.ఆరోగ్యం 2.సౌభాగ్యం.3.అనారోగ్యం 4.దౌర్భాగ్యం.5. నా భాగ్యం.

6.వైరాగ్యం 7.మృగ్యం 8.వ్యంగం. 9. యోగ్యం 10. మహాభాగ్యం.)


ప్రాతః కాలమున భాను దర్శనంతో లభిస్తుంది మన కారోగ్యం.

వాతరోగములు నశించకపోతే చుట్టుకుంటుంది మనకనారోగ్యం.


పూర్వకాలపు పద్ధతులు పాటించక పోవుటే మన దౌర్భాగ్యం.

సర్వజ్ఞతను పాశ్చాత్యులకు కట్టబెడితే మనకు మిగిలేది మృగ్యం.


ఘనమైన భరత దేశమున జన్మించుటే మనదౌ సౌభాగ్యం.

అనుకూలత లేని వైరుల మాటల్లో పొడసూపుతుంది వ్యంగ్యం.


ప్రతికూల పరిస్థితుల్లో తెచ్చుకోవాలి సుంతైనా వైరాగ్యం.

అతిగా పరుల నాగరికత ననుసరిస్తే మన జీవనమయోగ్యం.


సాధుసంతుల బాటలో మన మిద్దరమూ పయనించుటే మహాభోగ్యం.

మాధవా! నీకు తోడుగా నిలిచి బాధ్యతలు నిర్వహించటమే నా భాగ్యం.//


************************************














భాస్కరుడు.

(కవిత)


************************************


తిమిరాన్ని  తరుమగా చనుదెంచె

ద్యుమణి కరవాలమై మెరిపించె

సుమబాలల మోములు వికసించె

ధామమీ ధరను తెలుపులో ముంచె


మొయిలు పరదాలు తీసి చూశాడు

దయచూపు తెలివెలుగుల రేడు

నియమము పాటించు నీరజాప్తుడు

బయలుపైన  పరుగెత్తి వచ్చాడు.


పులకించె  నీ భూమాత  నగవుతో

పులుగులు కలకలా రావాలతో

పలుకరించెను పారవశ్యముతో

వెలుగుదొరను స్వాగతాంజలితో


ధరణికి మిత్రుడగు భాస్కరుడు

నిరతము కనిపించు వరదుడు

 స్మరించువారి కారోగ్యదాయకుడు

తరింపచేయగా నరుదెంచుతాడు//


ద్యుమణి= సూర్యుడు.

ధామము= కిరణము.

బయలు= ఆకాశము.

పులుగులు= పక్షులు.

వెలుగుదొర= సూర్యుడు.


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page