top of page

ప్రేమ తీరాలు - పార్ట్ 6

Updated: Sep 25, 2025

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries


Prema Theeralu - Part 6 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 20/09/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. లలిత గర్భవతి అవుతుంది. పండంటి బాబుకు జన్మనిస్తుంది. కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత కరుణాకర్, చెల్లెలు లలితల మధ్య దూరం పెరుగుతుంది. ఫణికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది లలిత. 



ఇక ప్రేమ తీరాలు పార్ట్ 6 చదవండి. 


“ఏమ్మా .. మీ వారికి ఎప్పటినుండి జ్వరంగా వుంటోంది?    

ఏదైనా హాస్పిటల్‌కు వెళ్ళారా ఈ మధ్యలో, అతని కండిషన్ బాగా లేదు. కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలి. తరువాత ఆపరేషన్ చెయ్యాలి. ఈలోగా మీరు డబ్బులు సమకూర్చుకోండి, ” డాక్టర్ లలితను పిలిచి చెప్పాడు. లలితకు గుండెలో రైళ్ళుపరుగెత్తినట్టు అలజడిగా ఉంది. 


“డాక్టర్ .. మా వారికి ఏమైంది ఆపరేషన్ అంటున్నారు, ఆయనకు ఎప్పుడూ జ్వరం కూడా రాలేదు. ఈరోజే మొదలు రావడం. అంతమాత్రానికే మీరు చెప్పేది నాకర్ధం కావాడంలేదు, ” అయోమయంగా చూస్తూ అడిగింది. 


“చూడమ్మా .. మేము పరీక్షలు చెయ్యకుండా ఊరికే చెప్పము కదా! మీ వారికి లోపల జ్వరం వస్తున్నా పట్టించుకోలేదేమో.. మాములే అనుకుని ఉంటాడు. ఇప్పుడు జ్వరం తీవ్రస్థాయిలో వచ్చే సరికి తట్టుకోలేకపోయాడు. ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది.

తొందరలో ఆపరేషన్ చెయ్యకపోతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు మేము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే అతని పక్షవాతం వచ్చి కాలుచెయ్యి పడిపోవచ్చు. 

లేదా మరణం సంభవించవచ్చు. చెప్పలేము. అతనికి అన్ని పరీక్షలు చేస్తున్నారు.మీరు తొందరగా ఏ సంగతి చెబితే దాన్ని బట్టి ట్రీట్ మెంట్ జరుగుతుంది, ” చెప్పాడు.


“డాక్టర్.. ఇప్పుడెలా ఉంది మా వారికి.. మాట్లాడుతున్నారా? నేను ఒకసారి ఆయన్ని చూడవచ్చా, తెలియకుండానే ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందనుకోలేదు. డాక్టర్.. 

ఆయనకు ఆపరేషన్ చెయ్యడానికి ఎంత డబ్బు ఖర్చయినా నేను పెట్టుకుంటాను, మీరు తొందరగా ఆయనకు ఆపరేషన్ చేసేలా చూడండి. ఆయన తొందరగా కోలుకోవాలి డాక్టర్, ”

అంటూ రెండు చేతులు జోడించింది. కళ్ళవెంబడి నీళ్ళు వద్దన్నా దుముకుతున్నాయి. 


“చూడమ్మా. డాక్టర్లు మాత్రం దేవుళ్ళు కాదు కదా.. మా శాయశక్తులా ప్రయత్నం చేస్తాము. చాలా వరకు సక్సెస్ అయ్యేందుకే చూస్తాము. అది మా విధికూడా. నీ భర్త విషయంలో కూడా మేము అదే చేస్తాము. అతన్ని మాములు మనిషిగా చెయ్యడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాము.


ఒకవేళ ఏదైనా జరుగరానిది జరిగితే దానికి మమ్మల్ని నిందించకూడదు. నీ అదృష్టం నీ పిల్లల అదృష్టం బాగుంటే మీ ఆయన తిరిగి వస్తాడు. దేవుడి మీద భారంవెయ్యి. ఆపరేషన్ కు ఎంత లేదన్నా ఇరవై లక్షల వరకు అంచనా 

వెయ్యగలము. ఇంకా ఎక్కువే కావచ్చు లేదా ఆయన కండీషన్ తొందరగా బాగుపడితే ఇంకా తక్కువకూడా కావచ్చు. నువ్వు ఆ డబ్బులు ఎంత తొందరగా కడితే అంత మంచిది, ”


“ఇరవైలక్షలా.. అంత డబ్బు ఎక్కడినుండి తేగలను! డాక్టర్.. మాకు ఇన్సూరెన్స్ ఉంది. అది ఎంతవరకు వస్తుందో చూసి చెబితే మిగతా డబ్బులు సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ” వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది. అంత డబ్బు తనెక్కడనుండి తేగలదు ఎవరినైనా అడుగుదామన్నా అంత డబ్బు ఎవరిస్తారు.. ఎందుకిస్తారు.. ఒకవేళ ఆ డబ్బు నేను కట్టకపోతే ఆయన పరిస్థితి ఏంటీ.. 


“దీనికి ఇన్సురెన్సులు పని చెయ్యవు. డబ్బులు కట్టాల్సిందే. తొందరగా డబ్బు ప్రయత్నం చేసుకుని చెప్పమ్మా, ” అంటూ లోపలకు వెళ్ళిపోయాడు డాక్టర్. 


పక్కనే ఉన్న కుర్చీలో కుప్ప కూలిపోయింది ఏం చెయ్యాలో అర్థంకాక. ఓదార్చేవాళ్ళు గానీ, సలహా ఇచ్చేవాళ్ళుగానీ ఎవ్వరులేరు పక్కన. కళ్ళముందు భర్త రూపం తప్ప ఏమి కనిపించడంలేదు. బోరున వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పైకి గట్టిగా ఏడవలేక కుమిలిపోతూ కర్తవ్యాన్ని వెదుకుతూ బయలుదేరింది ఇంటికి. 


“అమ్మా .. నాన్నేరమ్మా.. నువ్వొక్కదానివే వచ్చావు.. నాన్నకు ఎలా ఉందమ్మా, ” తల్లి రాగానే పరుగెత్తుకుంటూ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు కపర్ధి. 


“బాబు .. మీ నాన్న మీ నాన్న .. హాస్పిటల్ ఉన్నాడు, ” కొడుకుని పట్టుకుని తన మనసులో ఉన్న వ్యధను బయటకు పెట్టింది. పిల్లాడికి అర్థంకాక బిక్కముఖం వేసుకుని తల్లిని చూస్తున్నాడు. 


“లలిత .. ఏమైంది.. ఎందుకలా ఏడుస్తున్నావు.. పిల్లవాడు చూడు ఎలా భయపడుతున్నాడో, కొంచెం ఆగు. ముందు పిల్లవాడిని చూసుకో, ” సావిత్రమ్మ లలితను ఊరడిస్తూ అంది. 


“పిన్ని .. నేనేం చెయ్యాలో నాకే తెలియడంలేదు. నేను నిజంగా దురదృష్టవంతురాలను. పుట్టగానే తల్లితండ్రులను పోగొట్టుకున్నాను. ప్రాణంగా ప్రేమించే భర్తకు ప్రాణాలతో చెలగాటమాడే జబ్బు వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి పిన్ని, ” ఆమెను చుట్టుకుని బాధపడసాగింది లలిత. 


“చూడమ్మా లలిత .. కష్టాలనేటివి మనుషులకు కాక మానులకొస్తాయా చెప్పు? వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి కానీ ఇలా నువ్వు డీలా పడిపోయి

పిల్లవాణ్ణి భయపెడితే ఎలా చెప్పు, ముందు నువ్వు కాసిన్ని మంచినీళ్ళు తాగి కాస్త ఎంగిలిపడు. తరువాత ఏం చెయ్యాలన్నది చూద్దాం, ” లలితకు ఓదార్పునిస్తూ తినడానికి

ఒప్పించింది సావిత్రమ్మ. 


“ఆ.. ఇప్పుడు చెప్పు లలిత.. అసలు ఏం జరిగింది ఫణికి.. ఎలా ఉంది.. డాక్టర్ ఏమన్నాడు, ” లలిత దగ్గర కూర్చొని మెల్లిగా అడిగింది సావిత్రమ్మ. కపర్ధి వినకూడదని టీవి పెట్టి చూడమంది. చిన్నపిల్లవాడు టీవి పెట్టగానే అన్ని మరిచిపోయి చూడసాగాడు. 


“పిన్ని.. ఇప్పుడు నేను అంత డబ్బు ఎక్కడినుండి తేగలను.. నా భర్తను నేను ఎలా కాపాడుకోవాలో అర్ధంకావడం లేదు. నా తరుపునా పెద్దవాళ్లు లేరు ఆదుకోవడానికి. పోనీ ఆయనకైనా ఉన్నారా అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళుకాదు. అంతా అగమ్యగోచరంగా ఉంది పిన్ని, ” ఆమె ఒడిలో తలపెట్టుకుని అంది. 


“లలిత .. మీ అన్నయ్య, వదిన ఇద్దరు ఉద్యోగస్తులే కదా ! పైగా ఖర్చులేదు పిల్లలులేరు. నువ్వంటే మీ అన్నయ్యకు చాలా ఇష్టమని చెబుతావు కదా. నువ్వెళ్ళి అడిగితే కాదనడేమో ఒకసారి ప్రయత్నం చెయ్యి లలిత, ” చెప్పింది సావిత్రమ్మ. 


“నిజమే మీరన్నది. ఒకప్పుడు మా అన్నయ్యకు నేనంటే ప్రేమ ఉండేది. నాతోటిదే లోకం అన్నట్టుగా ఉండేవాడు. ఇప్పుడు తన భార్య ఇల్లు బాధ్యతలు పెరిగాయి కదా పిన్ని, మా వదిన వచ్చాక పుట్టింటి ముచ్చటలు తీరుతాయని నేనెంతో ఆశపడినాను. కానీ నా దురదృష్టం నాతోనే ఉంటుందని అనుకోలేకపోయాను, ”


“అదికాదమ్మా .. వాళ్ళ మనసుల్లో ఏమన్న ఉండని, నువ్వు ఆపదలో ఉన్నావు.నువ్వు పంతానికి పోకుండా అవసరం నీది కాబట్టి వెళ్ళి అడగడంలో తప్పులేదు. నా మాట విని వెళ్ళు. కావాలంటే నీకు తోడుగా నేను వస్తాను లలిత, ” ధైర్యం చెబుతూ అంది. 


“అలాగే పిన్ని, నా భర్తకోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను. పిన్ని.. నా భర్తకు బాగుపడేవరకు కపర్ధిని మీరు చూసుకోగలరా, నాకు తల్లిలాంటి వాళ్ళు. మీరు తప్పా నాకెవరు లేరు, ” సావిత్రమ్మ రెండు చేతులుపట్టుకుని అడిగింది. 


”లలిత .. ఎంతమాటన్నావు.. ఆపదలో తోడు లేకపోతే అది మానవత్వం అనుకోదు. నువ్వు కపర్ధి గురించి ఏమి బాధపడకు. నువ్వే చెప్పావు కదా తల్లిలాంటిదాన్నని, అలాగే అనుకో. కపర్ధి నాకు మనవడు. సరేనా.. నువ్వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడు, ” లలిత భుజం ఆప్యాయంగా తడుతూ అంది. 


“ఎవరు.. లలిత.. ఓ.. ఎన్నాళ్ళకు గుర్తుకు వచ్చాము.. ఒక్కదానివే వచ్చావు.. మీ వారు, బాబు రాలేదేం, ” వ్యంగంగా అడిగింది లోపలికి రమ్మన్నట్టు పక్కకు జరుగుతూ. 


మనసు చివుక్కుమంది లలితకు. అయినా అవసరం తనది. ఇవేమి పట్టించుకోవద్దు.. అనుకుంటూ. “వదినా బాగున్నారా.. అన్నయ్య లేడా ఇంట్లో, ” లోపలికి చూస్తూ అడిగింది. 


“ఆ ఉన్నారు. ఉండక ఎటు వెళ్తారు.. ఏమండి.. మీ చెల్లెలు వచ్చింది, ” అంటుండగానే లోపలినుంచి వచ్చాడు కరుణాకర్. 


“లలిత.. ఏంటమ్మా అలా ఉన్నావు.. ఏమైంది.. ముఖమంతా పీక్కుపోయింది.. ఆ కళ్ళేంటి ఎర్రగా ఉబ్బిపోయాయి.. ఏమైంది, ఫణి ఎక్కడా.. ఒక్కదానివే వచ్చావు.. బాబు బాగున్నాడా, ” లలితను చూడగానే ఆత్రుత తట్టుకోలేక ప్రశ్నల మీద ప్రశ్నలు వేసాడు. 


కరుణాకర్ ను చూడగానే తట్టుకోలేకపోయింది. జరిగిన విషయం చెబుతూ తనివితీరా అన్నను కౌగిలించుకుని ఏడ్చింది లలిత. 


“లలిత.. ఊరుకోమ్మా. నేను ఉన్నాను కదా. ఎంత కష్టపడి అయినా డబ్బులు తీసుకవస్తాను. పద మనం ఇప్పుడే వెళ్ళి ఫణిని చూద్దాం, ” గబగబా డ్రెస్సు వేసుకోవడానికి లేచాడు. ఇదంతా గమనిస్తున్న రాధకు కోపం నసాళానికంటింది. 


కరుణాకర్ కు అడ్డంగా నిలబడి. “ ఏమిటి మీ చెల్లెలు కల్లబొల్లి కబుర్లు చెప్పి కడవల కొద్ది నీళ్ళు గుమ్మరించాగానే కరిగిపోయి సహాయం చెయ్యడానికి వెళుతున్నారా, చూసి రావడమేనా లేకపోతే ఎక్కడైనా తల తాకట్టు పెట్టి డబ్బులు పుట్టిస్తారా, ” హేళనగా అంటూ కోపంగా చూడసాగింది లలితవైపు. 


“రాధ.. ఏం మాట్లాడుతున్నావు.. మా చెల్లెలు ఎంత బాధలో ఉందో చూసావా? తనకు మనం కాకపోతే ఎవరున్నారు, ఇలాంటి స్థితిలో నువ్విలా మాట్లాడడం మంచిది కాదు. నేను నాచెల్లెలికి సహాయం చెయ్యడానికే వెళతాను. రామ్మా మనం వెళదాము, ” చెల్లెల్ని పిలుస్తూ బయలదేరడానికి ముందుకు అడుగువేసాడు. 


“ఆగండి.. మీకు నాకంటే మీ చెల్లెలు ఎక్కవయిందన్నమాట.. నాకు తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలుసు. అందుకే ఇన్నాళ్ళనుండి మీ మధ్య దూరం పెంచుతున్నా తగుదునమ్మా అంటూ ఈరోజు దిగింది. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా నయాపైస పుట్టించలేవు. అంతగా నువ్వు డబ్బులు సహాయం చెయ్యాలనుకుంటే మన మధ్య బంధం తెంచుకుని వెళ్ళడం మంచిది. నీకు నీ చెల్లి కావాలో నేను కావాలో నిర్ణయం తీసుకొని బయట కాలు పెట్టండి, ” మహా కఠినంగా చెపుతూ పక్కకు జరిగింది ఎలా వెళ్తావో చూస్తాను అన్నట్టుగా. 


“రాధ.. నువ్వు ఎందుకింత కఠినంగా మారిపోయావు.. మన పెళ్ళప్పుడున్న రాధ వేరు, నేనిప్పుడు చూస్తున్న రాధ వేరు. మా పుట్టుకనే పెద్ద విషాదం. అందులో మా బతుకులు దయా ధర్మం మీద ఆధారపడి ఎలాగోలా కష్టపడి పైకొచ్చిన వాళ్ళం. నాకు చెల్లెలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నేను నీకు ముందే చెప్పాను కూడా.. నాకు ఎవరైనా నా చెల్లెలు తరువాతనేనని. నీలో ఈ మార్పేంటో నాకర్ధం కావడం లేదు.


ఎందుకు నా చెల్లి మీద ఇంత కక్ష పెంచుకున్నావు చెప్పు రాధ, ” శాంతంగా అడిగాడు కరుణాకర్. 


తను కోపంచేస్తే రాధలో ఆవేశం కట్టలుతెంచుకుంటుంది ఇంకా లలితను అనరాని మాటలంటుంది అనుకున్నాడు. 


“నేను మీకు ముందే చెప్పాను నేను మీకు భార్యను అయ్యాక నన్ను ఎప్పుడు చిన్న చూపు చూడకూడదని. మన మధ్య వేరే మనిషి ప్రమేయం వద్దన్నాను. మీరు నన్నెప్పుడు నిర్లక్ష్యం చెయ్యకూడదని మీ ప్రేమలో నేను నా గత జ్ఞాపకాలను గుర్తుచేసుకోకూడదని చెప్పాను. మీరు విన్నారా? నాకర్మ కొద్ది మన పెళ్ళి అనుకోగానే అన్ని అవాంతరాలు మనను చుట్టుముట్టాయి, మందికి సేవలు చెయ్యడంతోనే సరిపోయింది.


పెళ్ళి చేసుకున్న ఆనందం మచ్చుకైనా లేకుండాపోయింది. అది ఎవరి వల్ల.. మీ ముద్దుల చెల్లెలు వలన కాదూ? అందుకే నేను నా భర్త తప్ప ఎవరు వద్దు నాకు. మీ కిష్టమైతే 

నేను చెప్పింది వినండి. లేదంటే మీకు నాకు ఎడబాటు తప్పదు, ” తన మనసులో ఉన్న అక్కసునంత గుమ్మరించింది రాధ. 


“వదినా.. నీకు నేనేం అపకారం చేసాను.. ఎందుకు నా మీద ఇంత పగ పెంచుకున్నావు.. తల్లిలేని నాకు మీ దగ్గర ఆప్యాయత దొరుకుతుందని ఆశపడినానే గానీ మీ నుండి కట్నకానుకలు ఆశించలేదు. నీ మనసులో ఏముందో చెపితేగాని తెలియదు కదా! పోనీ నేను ఏదైనా మీ ఎడల తప్పుచేసినట్లతే ఆ తప్పేంటో చెబితే సరిదిద్దుకుంటాను, ” అంది. 


“నువ్వు చేసినా నీకు తెలియదు. నువ్వు నీ మొగుడితో హాయిగా ఉన్నావు. ఎవరెట్ల పోతే నీకెందుకు. పాపం నా స్నేహితురాలు సరిత నీవల్ల కాదు కోరుకున్న భర్తను పొందలేకపోయింది. తన జీవితం నీ వల్లనే మోడువారి పోయింది. అందుకే నువ్వంటే నాకు అసహ్యం, నా పెళ్లికి ముందే తెలిసుంటే మీ అన్నను పెళ్ళి చేసుకునేదాన్ని కాదు.

ఇప్పుడర్ధమైందా నువ్వంటే నాకెందుకు ఇష్టముండదో, ” నోటికి నచ్చినట్టు అని లోపలికి వెళ్ళి దడాలున తలుపేసుకుంది. 


రెండుచేతులతో తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు ఏం చెయ్యాలో తోచక. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఫణి మరోవైపు తన జీవిత సౌధం కూలిపోయే పరిస్థితి. 

అన్నయ్యను చూస్తూ కళ్ళప్పగించేదే గానీ నోటమాట రావడం లేదు లలితకు. పెళ్ళి చేసుకుని అందమైన జీవితం గడుపుతాడనుకున్న అన్నయ్యకు ఆదరణ కరువైపోయిందే అని బాధ లోపల్నుండి తన్నుకొస్తుంది. అన్నయ్య సహాయంతో తన భర్తను సంకటం నుండి కాపాడు కోవచ్చనుకున్న తన చివరి ఆశ అడియాశే అయింది. ఇప్పుడు తనకు దిక్కెవరు.. అంత డబ్బు ఎవరు ఇయ్యగలరు.. ఆలోచిస్తూ అలాగే నిలబడింది. 


“లలిత.. పదమ్మా.. ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. ముందు మనం ఫణిని రక్షించుకుందాము, ” అన్నాడు. ఎంతోసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి. 


 కానీ .. లలిత అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. “అన్నయ్యా.. మా వలన నీ జీవితం విడిపోవడం నాకు నచ్చలేదు. కష్టమైనా సుఖమైనా భార్య భర్తలు కలిసుండాలన్నదే నా కోరిక. నా కష్టమేదో నేనే పడతాను. అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోనైనా నా భర్తను బ్రతికించుకుంటాను. ఏ భార్యకైనా తన భర్త ప్రేమ తనకే దక్కాలనుకోవటం తప్పు కాదు.

ఇందులో వదినను తప్పు పట్టే పని లేదు. నువ్వు వదినను ప్రేమగా చూసుకో అన్నయ్యా. మా కష్టాలు ఎప్పుడు ఉండేవే. వస్తాను, ” అంది తన్నుకొస్తున్న దుఃఖాన్ని

బలవంతంగా ఆపుకుంటూ. 


“లలిత .. ఇది మాకు కొత్త కాదు. పెళ్ళైయినప్పటినుండి ఇదే జరుగుతుంది, తనకోసం నిన్ను దూరం చేసుకోలేను. తనిష్టముంటే ఉండని లేదంటే వెళ్ళిపోని.. నాకేం బాధలేదు. నాకు ప్రశాంతత కావాలి, ” అన్నాడు. 


“అన్నయ్యా .. నువ్వు నాతో రావద్దు. నా కష్టమేదో నేను పడతాను, నామాట విను. వదిన లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటుందో చూడు, నువ్వు వదిన మాట కాదని నాతో వస్తే నీ చెల్లెలు ఈ జన్మలో నీ ముఖం చూడదు గుర్తుంచుకో, ” 


అక్కడే ఉంటే తోడబుట్టినవాడిని ఏం మాటలనవలసి వస్తుందోనని గబగబా వెనకకు చూడకుండా బయటకు వచ్చి ఆటో ఎక్కి హాస్పిటల్‌కు వచ్చింది భర్తను చూసి డాక్టర్ తో మాట్లాడడానికి. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




2 Comments



@sowmyakoride9848

•1 day ago

Super story attaya

Like

@kpj6968

•5 hours ago

Very intresting story❤

Like
bottom of page