top of page

రమణీయం

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #రమణీయం, #Ramaneeyam, #TeluguKathalu, #తెలుగుకథలు



Ramaneeyam - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 31/12/2024

రమణీయం - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


"అమ్మా ! జంతికలు చేస్తావా ? తినాలని ఉంది " అడిగింది అప్పుడే స్కూలు నుంచి వచ్చిన త్రిష. 

"ఈరోజు నాకు ఆఫీసులో పని ఎక్కువయింది. నాకు ఓపిక లేదు. ఇంకోరోజు చేస్తాలే! " అంది తల్లి వర్ధని. 


ఇదంతా వింటున్న రమణమ్మ "ఓ సొసి ఇంతేనా! నేను చేస్తాలే మనవరాలా! " అని వంటగదిలోకి నడిచింది. 


చేటడంత ముఖంతో తను కూడా బామ్మతో వెళ్ళింది త్రిష. బామ్మ చెప్పినట్టు గిన్నె, శెనగపిండి‌, నూనె‌, బాణలి, చిల్లుల గరిటె తదితర సరంజామా ఆవిడకు అందించింది త్రిష. 


వాటిని అందుకుని అంతా సిధ్ధం చేసుకుని పొయ్యి వెలిగించి జంతికలు తయారుచేయ మొదలుపెడుతూ "నాచేతితో చేసిన ఏ పిండివంట అయినా మీ తాతయ్యకు చాలా ఇష్టం. ముఖ్యంగా కరకరలాడే జంతికలు అంటే మరీను. ఏమేవ్ రమణీ! ఈరోజు ఇది చేయి, ఆరోజు అది చేయి" అని ఎప్పుడూ అడిగి మరీ చేయించుకుని ఇష్టంగా తినేవారు. 


 అసలు ఆరోజులే వేరు. ఇప్పటిలా ఫాస్ట్ ఫుడ్స్, డబ్బులు పెడితే ఏదయినా కొనుక్కునే సదుపాయాలు ఆరోజుల్లో మాకు లేవుగా! రుచికరమైన వంటలు. ఆరోగ్యం కూడా మాకు అలాగే ఉండేది. 80 ఏళ్ళ దాకా కూడా సుష్టుగా తిని, తిన్నది హరాయించుకుని హాయిగా తిరిగేవాళ్లు. ఈరోజుల్లో పిదప కాలం పిదప బుధ్ధులు. రుచీపచీలేని వంటలు అంటూ ఫాస్ట్ ఫుడ్స్ మీద తన అయిష్టతను వెల్లడి చేస్తూ సాగదీసింది రమణమ్మ. 


"బామ్మా! చెప్పు. చెప్పు ఆ రోజుల్లో మీరు ఏంచేసేవారో? " అంది త్రిష. 


ఇంక రమణమ్మ సంతోషంతో చెప్పటం మొదలుపెట్టింది. "నేను కాపురానికి వచ్చేటప్పటికే మీతాతయ్య వ్యవసాయం చేస్తూ గ్రామ సర్పంచిగా ఉండేవారు. పల్లెటూరు. లంకంత ఇల్లు. గేదెలు, పాడి - పంట సమృధ్ధిగా ఉండేది. నిత్యము అత్త, మామలకు మర్యాదలు. వంటావార్పులు, వాళ్లకి సేవలు, వచ్చేపోయే అతిధులతో నాకు విపరీతమైన చాకిరీ. దాంతో నాకు క్షణం తీరికగూడా ఉండేది కాదు. ఏకైక కోడలు అయినందున బరువు బాధ్యతలు కూడా ఎక్కువే. బద్దకం అనేది ఎరగను. మా అత్తగారు ఎప్పుడూ ఏదో పని నాకు పురమాయిస్తూ ఉండేది. ఎంత చేసినా ఆవిడకి తృప్తి ఉండేది కాదు. పైగా ఆవిడకు గయ్యాళితనం ఎక్కువ. 


మీ తాతయ్యకు వాళ్లమ్మ అంటే ఇష్టం. పైగా ఆయనది మెతక స్వభావం. అమ్మ చెప్పిందే వేదం ఆయనకు. అది అలుసుగా తీసుకుని నామీద, నా పుట్టింటి వారి మీద ఎప్పుడూ ఏదో ఒకటి నేరాలు చెపుతూ ఉండేది మా అత్తగారు. ఆవిడకు అదో ఆనందం. ఆవిడ బ్రతికున్నన్నాళ్ళూ నన్ను ఆరళ్ళు పెట్టిందనుకో! ఆవిడంటే నాకే గాదు, చుట్టుప్రక్కలవారికి గూడా చచ్చే భయం. 


 ఇలా కాలం గడుస్తుండగా నాకు మీ నాన్న, మీ మేనత్త పుట్టారు. ఇంక వాళ్ల పోషణ, పెంపకం, చదువు సంధ్యలతో కాలం ఇట్టే గడిచిపోయేది. ఇంట్లో వారానికి రెండు, మూడు పిండివంటలన్నా చేయాల్సిందే. దాంతో ఎప్పుడూ చేగోడీలు, జంతికలూ, అరిశెలూ మొదలగునవి చేసేదాన్ని. వార్థక్యరీత్యా కొన్నేళ్ళకు మా అత్తగారు, మామగారు చనిపోయారు. ఆ తర్వాత మీనాన్న, మీ అత్తల చదువులు పూర్తయ్యి వాళ్లకు పెళ్లిళ్లయ్యాయి. మీ అమ్మ వర్ధనిని ‘నా కూతురు లాగా చూసుకోవాలి’ అనుకుని అలాగే చూసుకుంటున్నా. అత్తంటే మా అత్తగారిలా ఉండకూడదనుకున్నాను. 


మీ తాతకు నా చేతివంటలంటే ఇష్టంతో ఎప్పుడూ ఏదో ఒకటి చేయించుకుని పంటికింద నములుతూ ఉండేవారు. నా వంటింటికి నేనే మహారాణిని. ఈ పీటనే సింహాసనంగా, నా చేతిలోని వంట గరిటెనే ఒక ఆయుధంగా భావిస్తూ సంతోషించేదాన్ని. ఇంటికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల అందరూ "నీ పేరు రమణమ్మ అని పెట్టారు కానీ అన్నపూర్ణ అని పేరు పెట్టాల్సింది " అంటే పొంగిపోయేదాన్ని. అసలు ఆరోజులు, ఆ ఆప్యాయతలే వేరనుకో!


‘రమణీ! నీచేతి జంతికలు ఎంత రుచిగా ఉంటాయో! నీవేది చేసినా అమృతమే. నీ చేతిలో ఏదో మహత్యం ఉంది సుమీ’ అని తెగ మెచ్చుకునేవారు మీ తాతయ్య. నన్నొదిలి పైలోకానికి పోయి ఏంచేస్తున్నారో! ఏమో!” అంది భర్తని తలుచుకుని.


“బామ్మా! తాతయ్యకు ఇప్పుడు నీవు గుర్తున్నావో? లేదో ? స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారట గదా ! వాళ్లు చాలా అందగత్తెలట. తాతయ్య కూడా అందగాడని నీవెప్పుడూ చెబుతూ ఉంటావుకా! ఆ రంభా, ఊర్వశిల మోజులో పడి తాతయ్య నిన్ను ఎప్పుడో మర్చిపోయుంటారు.” అంది త్రిష. 


“ఛ! ఛా! అవేం మాటలే పిల్లా! మీ తాతయ్యని గురించి నీకు తెలీదు. ఆయన శ్రీరామచంద్రుడు. నేనంటే ఆయనకు ప్రాణం. ఎప్పుడూ “రమణీ! రమణీ!” అంటూ కాలుగాలిన పిల్లిలా ఎప్పుడూ నా చుట్టూతా తిరిగేవారు. నన్నొదిలి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. ఇప్పుడెలా ఉన్నారో? ఏమో?” అంది భర్తని తలుచుకుంటూ. 


 "బామ్మా! మీ రోజుల గురించి చాలా బాగా చెప్పావు. జంతికలు చాలా చేశావు. నాకు బాగా ఆకలివేస్తోంది. నాకు ముందు కొన్నిటిని పెట్టవా !" అంటూ ప్లేటు తెచ్చింది త్రిష. 


 వేడివేడి జంతికలను మనవరాలి ప్లేటులో వేసిన రమణమ్మను "మా మంచి బామ్మ " అని ముద్దిచ్చి "తాత కూడా ఇలా చేసేవారా బామ్మా ! " అని హాలులోకి పరుగుతీసింది త్రిష. 


" పోవే భడవా ! జంతికలు ఎలాగున్నాయో వాటిని తిని చెప్పు. " అంటూ నవ్వుతూ తను కూడా పొయ్యిలోని మంటని ఆర్పేసి హాలులోకి వచ్చింది రమణమ్మ. 


.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








2 Comments


mk kumar
mk kumar
Jan 02, 2025

"రమణీయం" పల్లెటూరి జీవనశైలిని, కుటుంబ అనుబంధాలను చాటిచెబే హృదయస్పర్శక కథ. ఈ కథలో రమణమ్మ తన మనవరాలు త్రిషకు పాతతరం జీవనమాధుర్యాన్ని జ్ఞాపకాల రూపంలో వివరిస్తుంది. వంటలు, కుటుంబ బాధ్యతలు, పల్లెటూరి వాతావరణం జీవనానికి ఆత్మస్ఫూర్తిగా ఉంటాయని రచయిత స్పష్టంగా చూపించారు. తరం తేడాలను, ఆత్మీయతలను రమణమ్మ-త్రిష మధ్య సన్నివేశాలు హృద్యంగా వ్యక్తీకరిస్తాయి. తాతయ్య-రమణమ్మల ప్రేమ అనుబంధం జీవనమాధుర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పాతతరపు విలువలు, అనుబంధాల ప్రాధాన్యతను ఈ కథ సున్నితంగా బోధిస్తుంది. రచయిత కథన శైలిలో హాస్యాన్ని, భావుకతను సమపాళ్లలో పొందుపరిచారు. రమణమ్మ పాత్ర జీవం తోడినట్టుగా ఉండగా, త్రిష ఆధునికతను ప్రతిబింబిస్తుంది. పాత విలువలు, ఆధునికత సమన్వయమే కథకు ప్రధాన సందేశం. కుటుంబ అనుబంధాల పరిమళాన్ని గుర్తు చేసే కథ


Like

నీరజ ప్రభ గారి "రమణీయం" కుటుంబ కథ - ఆప్యాయత - అనుబంధాలు గుర్తు చేశాయి ... వెరీ రిఫ్రేశింగ్

------X X X---------

పి.వి.పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page