తిండిగోల
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Thindigola, #తిండిగోల, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Thindigola - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 20/07/2025
తిండిగోల - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"కావ్యా..! ఈ రోజు టిఫిన్ ఏంటో డియర్?" అడిగాడు కమల్ కొత్త పెళ్ళాన్ని.
"తెల్లారగానే అలా అడగకండి.. నాకు కోపం వస్తుంది.. "
"ఎందుకో పాపం.. ?"
"ఉదయం అసలే ఉండే టైం తక్కువ.. మళ్ళీ ఏం టిఫిన్ అని అడగాలా.. ?"
"అంటే.. ? నువ్వు అనేది.. ?"
"అవును అదే.. ఆ.. అదే.. "
"మళ్ళీ అదేనా.. ?" అంటూ తల పట్టుకున్నాడు కమల్.
"మీ లక్కీ కలర్ వైట్ కదా.. అందుకే అదే కలర్ ఉప్మా" అంది కావ్య.
"రోజూ ఏం తింటమే చెప్పు.. ? కాస్త రాత్రి పిండి నానబెట్టి ఉదయాన్నే వడలు వేసి.. అల్లం చట్నీతో తింటే భలే ఉంటుందీ. లేకపోతే వేడి వేడిగా నాలుగు పూరీలు.. కూరతో తింటే కమ్మగా ఉంటుంది. పల్చగా దోశలు వేసి కొబ్బరి చట్నీతో సూపర్ గా ఉంటుంది. ఏదైనా ఓకే.. ఆ ఉప్మా తప్ప" అంటూ దణ్ణం పెట్టాడు.
"మీకింత తిండి గోల ఎందుకండీ.. ?" అడిగింది కావ్య.
"పెళ్ళికి ముందు బ్యాచలర్ లైఫ్ లో తిండి సరిగ్గా లేదు. మన తెలుగు భోజనం తినింది అసలే లేదు. ఎక్కడో ఢిల్లీ లో వచ్చింది ఆ ఉద్యోగం.. ఏం చెయ్యను. అక్కడ ఆ చపాతీలు పీక్కుని, లాక్కుని తినేవాడిని. అక్కడ చపాతీలు కామన్, అన్నం స్పెషల్. అన్నం తినాలంటే, చాలా దూరం వెళ్ళాల్సిందే. పోనీ వండుకుందామంటే, టైం ఉండేది కాదు.. వంటా అంతగా రాదు. పోనీ మా అమ్మని రమ్మంటే, ఆ పల్లెటూరులో మా నాన్నకు వండి పెట్టడంతోనే సరిపోయేది.. 'నువ్వే ఎలాగో మేనేజ్ చేసుకో'.. అని చెప్పేసింది.
ఎక్కడ చూసినా అవే చపాతీలు.. వీధికొక రకం.. ! ఒకడేమో ఆలు లోపల కూరతాడు.. మరొకడు వేరే కూర కూరతాడు.. ఇంకొకడు ఆకులు కూరతాడు. అవే తిని నోరు చచ్చిపోయిందనుకో.. పెళ్ళయ్యాక పెళ్ళాం బాగా వండిపెడుతుందిలే అని అప్పుడు సర్దుకుపోయాను.
పోనీ.. ఎప్పుడైనా, చుట్టాలింటికి వెళ్ళితే.. ఇష్టమైన టిఫిన్ పెడతారేమోనని ఎంతో ఆశగా చూస్తే.. నీలాగే టక్కున రవ్వ తెప్పించి, ఐదు నిమిషాలలో తెచ్చేసేవారు వేడిగా.. అదే ఉప్మా.. ! పెళ్లయ్యాక ఇప్పుడు నువ్వు కూడా ఆ ఉప్మాలు.. చారు అన్నమే పెడుతున్నావు. ఎన్ని టిఫిన్స్ ఉన్నాయో కదా.. ఇడ్లీ, పూరీ, దోశ, వడ, ఇంకా ఎన్నో వున్నాయి.. చెబుతూ ఉంటేనే నా నోరు ఊరిపోతోంది కావ్యా"
"బకెట్ తెస్తాను ఉండండి.. నేలంతా పాడు చెయ్యకండి! అయినా నాకు అవేమి రావు.. ఇంకా నేర్చుకోవాలి. ఆ చపాతీ కన్నా నా టిఫిన్ బెటరే కదండీ.. ! చపాతీ నుంచి ఉప్మాకు మీకు ప్రమోషన్ వచ్చిందిగా, అలాగే మీకు నచ్చిన వాటికి రావడానికి ఇంకా వెయిట్ చెయ్యాలి"
"నువ్వు దానికి మురిసిపోతున్నావా బంగారం. అది నా ఖర్మ.. ఏం చేస్తాం? మరి పెళ్ళిచూపులలో అన్నీ బాగానే చేసావు కదే.. !"
"మన పెళ్ళిచూపులలో అన్నీ మా అమ్మే చేసింది.. మా అమ్మకి కూడా మొన్నటి దాకా అసలు వంటే రాదు.. తెలుసా.. ? మా నాన్న మరి వెయిట్ చెయ్యలేదూ. మా ఆడవారికి కూడా మీరు టైం ఇవ్వాలి.. అసలే కొత్త పెళ్ళాన్ని"
"మీ నాన్న పరిస్థితి నేను బాగా అర్ధం చేసుకోగలనే.. ఆ వారసత్వం ఇప్పుడు అల్లుడికి ఇచ్చారనమాట.. ! ఇప్పుడు మీ అమ్మ ఎన్ని పిండి వంటలు చేసినా, మీ నాన్నకు తింటే ఆయాసం, తినకపోతే నీరసం కదా. ఏం ప్రయోజనం? "
"అయినా తప్పదు! నేను మా పుట్టింట్లో ఇన్ని సంవత్సరాలు తినలేదూ.. ఉప్మా, చారన్నం"
"మీరు చాలా గ్రేట్! అవునులే.. నాకేమో బయట ఫుడ్ తినవద్దని డాక్టర్ చెప్పడం ఏమిటో.. నా ఖర్మ కాకపోతే. అక్కడ ఆ చపాతీలు తిని తిని, నా కడుపు పాడైపోయింది. ఇంకా అవే తింటే, కడుపు బల్ల లాగ అయిపోతుందని డాక్టర్ చెప్పారు.. బయట ఫుడ్ అసలే వద్దన్నారు. ఇలా అక్కడినుంచి వచ్చానో లేదో, డాక్టర్ ఇలా ఈ మంట కబురు చెప్పారు"
"మా నాన్న మరి ఆ ఉప్మా, చారన్నమే తిని, ఇన్నాళ్ళు బతకలేదా చెప్పండి.. ! మీరూ వెయిట్ చెయ్యండి!"
"రోజూ ఆఫీసుకి వెళ్లే దారిలో దోశలు వేస్తున్న ఆ శబ్దాలు, పొగలు కక్కుతున్న ఇడ్లీలు, నూనెలో స్నానమాడుతున్న పూరీలు, ఎన్నో రుచులు.. రోజూ కొత్త రుచులు పుట్టుకొస్తుంటే, అవన్నీ రుచి చూడడానికి ఈ జన్మ చాలదు మరి.. !
సాయంత్రం ఇంటికి తిరిగి వస్తునప్పుడు దారిలో.. వేడి వేడి జిలేబీ పిలుస్తోంది, సమోసా.. రా రా అంటుంది.. బజ్జీ బండి రుచి చూడమని పిలుస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం.. ? బతకాలంటే, నోరు కట్టేసుకోవాల్సిందే. ఇవన్నీ నువ్వు నాకోసం నేర్చుకుని ఇంట్లో చేసేలోగా.. నా జన్మ ముగిసిపోతుంది" అంటూ ఆకలికి ఆగలేక ఉప్మా నోట్లో పెట్టుకున్నాడు కమల్.
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ

Comments