యోగి వేమన
- T. V. L. Gayathri

- Jul 13, 2025
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #యోగివేమన, #అంబరీషుడు

గాయత్రి గారి కవితలు పార్ట్ 33
Yogi Vemana - Gayathri Gari Kavithalu Part 33 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 13/07/2025
యోగి వేమన - గాయత్రి గారి కవితలు పార్ట్ 33 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
యోగి వేమన
(ఆటవెలదులు )
**********************************
సంఘమందు కెరలు జాడ్యంబులన్ ద్రోల
వ్రాసినాడు మంచి పద్యములను
యోగి వేమన మన కుత్తమమౌ గతిఁ
జూపు చుండు ఘనుడు కాపుదలగ.//
మదము మత్సరమను మసటులో మున్గిన
మానవాధములకు మంచిబోధ
చేయబూని నాడు శ్రేయంబు చేకూర్ప
ఆటవెలదిగీతు లాలపించె.//
ధనము మీదనాశ ధరకుప్రమాదంబు
మూఢమతుల దుష్టబుద్ధి గాంచి
మంచి యొజ్జవోలె మార్పుకై తపియించి
పలికె సరళమైన పద్యములను.//
శక్తిహీనులయిన సామాన్య జనులకు
వెన్ను దన్నుగ జని భీతిమాన్పి
ధైర్యమొసగు కవిగ ధరలోన వెల్గిన
వేల్పువంటి బుధుడు వేమరాజు.//
నాటి పద్యధార నేటికీ ప్రవహించి
జీవ నదిగ మారి చేవ నిడును
వేమరాజు వంటి విద్వత్శిరోమణి
కానరాడు నూత్న కాలమందు//
************************************

అంబరీషుడు
(ఇష్టపది)
************************************
ఘనుడంబరీషుండు కంజాప్తు వంశమున
మునుపు జనియించితాన్ మోక్షమును పొందెనట
విష్ణుపూజారతుడు వినయగుణ వర్థనుడు
తృష్ణమెయి శ్రీహరిని దినదినము సేవించు
నుపవాస దీక్షతో నోర్పుగా జీవించి
జపతపారాధనము శ్రద్ధగా సల్పునట
నేకవర్షమున తా నేకాగ్రతగ నిల్చి
యేకాదశీ వ్రతము నీశుకై యొనరించె.
మౌని దుర్వాసుండు మదముతో శపియించ
ఫణిశాయిపై రాజు భారమును మోపెనట.
సుదర్శన చక్రమా శుద్ధాత్ము రక్షింప
కదలి వచ్చెను మౌని కంఠమును దునుమగా
దుర్వాసు గర్వంబు తొలగించి చక్రంబు
సర్వంబు మాధవుని జాలమని యెరిగింప
అంబరీషుని భక్తి కంజలిని ఘటియించి
అంబరంబున వేల్పు లా ఱేని నుతియింప
వరదుండు విష్ణుండు భక్తులకు మిత్రుడుని
తరతరంబుల వరకు తల్చిరా గాథలను.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments